దూసుకొస్తున్న ‘దిత్వా’.. తమిళనాట కుండపోత వానలు | Cyclone Ditva Heavy Rain In Tamil Nadu | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న ‘దిత్వా’.. తమిళనాట కుండపోత వానలు

Nov 29 2025 1:05 PM | Updated on Nov 29 2025 4:39 PM

Cyclone Ditva Heavy Rain In Tamil Nadu

విశాఖ: దిత్వా తుపాన్‌ దూసుకొస్తుంది. దిత్వా తుపాను కారణంగా తమిళనాడులో కుండపోత వానలు కురుస్తున్నారు. నాగపట్టిణం, కరైకల్, రామనాధపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరొకవైపు ఏపీకి ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక కుండపోత వానలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు సహా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరికలు పంపింది. గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. 

 

 

దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలం అవుతుంది.  శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడ్డాయి.

 శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌లో నదుల నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పెరగడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట తక్షణమే సాయం అందించింది.

దీనిలో భాగంగా వరద-నిర్వాసితులకు అత్యవసర సహాయ సామగ్రిని తీసుకువెళుతున్న భారత వైమానిక దళానికి చెందిన సీ130 విమానం శనివారం తెల్లవారుజామున కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో అవసరమైన ఆహారం, శానిటరీ సామాగ్రిని తరలించారు. సముద్ర మార్గం ద్వారా కూడా ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ప్రారంభమైంది.  తొలి విడత సహాయ సామగ్రిని భారత నావికాదళానికి చెందిన  ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి ద్వారా ఇప్పటికే తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement