కూటమిలో కుంపటి.. మరో కొత్త తలనొప్పి! | KSR's Comments On AP Coalition Government Political Controversy Internal Differences | Sakshi
Sakshi News home page

కూటమిలో కుంపటి.. మరో కొత్త తలనొప్పి!

Aug 14 2026 10:41 AM | Updated on Aug 14 2026 11:09 AM

KSR's Comments On AP Coalition Government Political Controversy Internal Differences

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అద్వాన్నంగా పనిచేస్తున్నది ఆ పార్టీల నేతలే బహిర్గతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం సాగుతున్నది కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్న కొంతమంది మేధావులు ప్రభుత్వ తీరుపై పెదవి విరవడమే కాకుండా, ప్రభుత్వం ఐసీయులో ఉందని కామెంట్ చేస్తున్నారు.

ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆరోపణల పర్వం, విజయవాడలో టీడీపీకే చెందిన డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులుతో బలవంతపు రాజీనామా చేయించడం తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా సహాకార పాల ఉత్పత్తుల సంఘం విజయ డెయిరీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లకు నచ్చలేదేమో తెలియదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇద్దరు మంత్రులు హుటాహుటీన డెయిరీ ఆఫీస్‌కు వెళ్లి ఆంజనేయులు రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు పంపకపోతే వారు ఎందుకు వస్తారన్నది టీడీపీ వర్గాలలో ఉన్న టాక్.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రంగంలో దిగి డెయిరీ కార్యాలయానికి వెళ్లి ఆంజనేయులును బెదిరించారట. రాజీనామాకు ఆయన సుముఖంగా లేరు. అయినా మంత్రుల హూంకరింపులతో ఆంజనేయులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆంజనేయులు కూడా టీడీపీకి చెందినవారే అయినా ఎందుకు ఇంతగా కక్ష కట్టారన్న చర్చ జరుగుతోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈయనపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన అలిగారట. దాంతో ఆయనను బుజ్జగించడానికి గాను ఆంజనేయులుతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావించిందట.

అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల కంపెనీకి లాభం చేకూర్చడానికే చలసానితో రాజీనామా చేయించారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అది వేరే విషయం. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి మంత్రులు చెప్పారట. అంతేకాక ఈ క్రమంలో ఆంజనేయులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులుగా పేరొందిన కొందరు యూట్యూబ్ చానళ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన పార్ధసారధి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బెడ్‌పై ఉన్న ఆంజనేయులుతో రాజీనామా పత్రాన్ని తీసుకుని ఫోటో దిగడంపై వారు మండిపడ్డారు. పార్ధసారధి తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి ఇంతగా తాపత్రయ పడ్డారని వీరు అంటున్నారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి వ్యతిరేకంగా అన్ని ఆరోపణలు చేసినా, మరికొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని టీడీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఘట్టం గుర్తుకు వస్తుంది. 1995లో పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి ఎన్‌టీఆర్‌ నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారని చెబుతారు. సరిగ్గా అదే రీతిలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యవహరించిందన్నమాట. కాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రభుత్వంలో సాగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికి పలుమార్లు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన కొందరు సాగిస్తున్న గంజాయి, ఇసుక మాఫియాలపై ఓపెన్‌గానే మాట్లాడారు.

తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలలో దామచర్లకు వాటాలు ఉన్నాయని, రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షలు వసూలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ అడ్డాగానే దందాలు సాగిస్తున్నారని కూడా బాలినేని అన్నారు. దీనికి ప్రతిగా దామచర్ల కూడా బాలినేనిపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని పార్టీ మారకపోతే, బాలినేని ఆయన కుమారుడు ఈపాటికి జైలులో ఉండేవారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు చూస్తే ఏమి అర్దం అవుతుంది. ప్రభుత్వంలోను, అలాగే అధికార కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అడ్డూ, ఆపు లేకుండా పోయిందనే కదా! కాని వీరిద్దరు సమన్వయం పాటించాలని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఒంగోలులోని తమ పార్టీ నేతలకు సందేశం పంపించారట. అంతే తప్ప ఇరువురు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా లేదన్నమాట.

అవినీతిని కాపాడటమంటే ఇది కదా అన్నది ప్రజల భావన. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మూడు పార్టీల సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారు. మనలో మనం విమర్శలు చేసుకోవదని సలహా ఇచ్చాయి. అంతే తప్ప అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించలేదు. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూటమి మిత్రపక్షాలలో విభేదాలు సృష్టించడానికి వైఎస్సార్‌సీపీ కుట్రలు చేస్తోందని పిచ్చి ఆరోపణ చేశారు.

ఈ మధ్య ఒక సినిమాకు సంబంధించి టీడీపీ, జనసేనల అభిమానులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారట. కొందరైతే దూషణలకు దిగారట. వాటిని వైఎస్సార్‌సీపీ అంటకట్టి తప్పించుకోవాలని చూస్తే ఎవరు నమ్ముతారు! కాగా రాష్ట్రంలో జరుగుతున్న అద్వాన్న పాలనను, అవినీతిని ప్రశ్నించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీపై కొత్త ఆరోపణ చేశారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా గోవింద నామాన్ని పేరడిగా వాడుతున్నారన్నది ఆయన అభ్యంతరమట. నిజంగానే ఆయన చిత్తశుద్దితో అభిప్రాయపడితే తగు సూచన చేయడం తప్పుకాదు. కాని సినిమాలలో ఎన్ని రకాల పేరడిలు హిందూ మత విశ్వాసాలపై జరిగాయో ఆయనకు తెలియదా! గోవిందా పేరుతో సినిమానే వచ్చింది. గతంలో ఎన్‌టీఆర్ ఒక సినిమాలో గోవింద అంటూ ఒక బాబాపై పాటకట్టారే. ఇలా ఎన్నో సన్నివేశాలు సినిమాలలో ఉన్నాయి. వాటి గురించి ఏమంటారో తెలియదు.

మంత్రి లోకేష్ కూడా గతంలో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా గోవిందా.. అంటూ నినాదాలు చేసిన వీడియోలు కూడా చక్కర్లు తిరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాటను కూడా చూపుతున్నారు. అందుకే ఏదైనా విమర్శ చేయాలనుకుంటే ముందూ, వెనక ఆలోచించాలని అంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. వైఎస్సార్‌సీపీపై బురద వేసే క్రమంలో ఈ ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న విమర్శలు వచ్చాయి. తదుపరి సీబీఐ దర్యాప్తులో అలాంటి జంతు కొవ్వు కల్తీ ఏది జరగలేదని తేలింది. మరి దానిపై వీరు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ సనాతన ధర్మం పేరుతో ప్రజలను ఏమార్చడానికి వచ్చినట్లుగా ఉంది.

ఒంగోలులో తన పార్టీ నేత చేసిన ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. పైగా రెండు పార్టీలు కాంప్రమైజ్ ఫార్ములా వర్కవుట్ చేయడం ఏమిటి? ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది. చలసాని ఆంజనేయులు నుంచి ఆస్పత్రిలోనే రాజీనామా పత్రాన్ని మంత్రి పార్ధసారధి తీసుకుంటున్న పోటో టాగ్ చేస్తూ ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ వారిని నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు.. ఏబీతో పాటు మరికొందరు టీడీపీ వీర మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చే ధైర్యం చేయగలరా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement