సాక్షి, గుంటూరు: అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు.. వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, అప్పులు సైతం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఏడేళ్లలో అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మార్కెటింగ్ తప్ప మరొకటి కాదన్నారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదన్నారు. మరోవైపు ఖర్చులను భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతి అంటే అద్భుత నగరం కాదు.. అవినీతి, దోపిడీకి కేంద్రం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోడ్ల నిర్మాణంపై ప్రశ్నలు
అమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయాలపై అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్ల వరకు ఖర్చు చూపిస్తున్నారన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనూ రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అన్నారు. 21.77 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,519 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని.. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనులను అంచనాలు పెంచి రూ.356 కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రైతుల పరిస్థితిపై ప్రశ్నలు
రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితిపైనా అంబటి ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లే అవుట్లు అందించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొలాలు ఇచ్చినందుకు రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
‘‘అద్దాల భవనాల పేరుతో వేల కోట్లు’’
అమరావతిలో అద్దాల భవనాలు, భారీ నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంబటి అన్నారు. తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో చదరపు అడుగు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పెరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
‘‘బాబు, లోకేశ్‌లకు చెప్పే ధైర్యం ఉందా?’’
అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారంటూ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.


