జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య జిల్లాతో ప్రత్యేక అనుబంధం సముచిత రీతిలో గౌరవించిన మాజీ సీఎం వైఎస్ జగన్ భారతరత్న కోసం కేంద్రానికి సిఫార్సు లేఖ మరింత ప్రాచుర్యం కావాలంటున్న పింగళి కుటుంబ సభ్యులు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొరవ
స్వాతంత్య్ర దినోత్సవ వేళ వెంకయ్య సేవలు స్మరణీయం
గుంటూరు వెస్ట్: ఒక దేశ సార్వభౌమత్వం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేస్తే గొప్ప జాతి ఆవిర్భవిస్తుంది. ఎన్ని తరాలైనా అటువంటి గొప్పవారి త్యాగాలను స్మరించుకుని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లడం నేటి తరం బాధ్యత. దీనికి ప్రభుత్వాలు కూడా కులమతాలకు అతీతంగా వ్యవహరించిన నాడు సమరయోధులకు నిజమైన నివాళి లభిస్తుందనడంలో సందేహం లేదు. ఆ కోవలోనే దేశం కోసం తపించిన వ్యక్తి అయిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగువారు కావడం గర్వకారణం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహనీయుని సేవలను అందరూ మనసారా స్మరించుకోవడం ఎంతో సముచితం.
జిల్లాతో ప్రత్యేక అనుబంధం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2న జన్మించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో (అప్పట్లో గుంటూరు కూడా కృష్ణా జిల్లాలో కలిసే ఉండేది) జన్మించారు. పింగళి ఏకై క కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి (100) మాచర్లలో వారి రెండవ కుమారుడి వద్ద మూడు దశాబ్దాలపాటు ఉన్నారు. ఆమె 2022లో మరణించారు. 1913వ సంవత్సరం బాపట్లలో సర్ బయ్యా నరసింహేశ్వర శర్మ అధ్యక్షతన జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలో పింగళి స్ఫూర్తిదాయక ప్రసంగం మొదలుకొని, పలుమార్లు జిల్లాకు వచ్చి ఇక్కడి నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఆయనకు గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య పంతులు, పావులూరి శివరామ కృష్ణయ్య తదితర ప్రముఖులతో సన్నిహిత సంబంధాలుండేవి.
జెండాకు అంకురార్పణ
అది 1906వ సంవత్సరం. కోల్‌కత్తా మహానగరంలో దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షతన కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భం. అప్పటి రోజుల్లో ఏ సభలు జరిగినా బ్రిటిషు వారి జెండాను ఎగురవేసి, వారి జాతీయ గీతాన్ని ఆలపించాలన్న నిబంధన ఉండేది. అయితే ఈ నిబంధన పింగళి వెంకయ్యకు నచ్చలేదు. అవమానంగా భావించారు. ఆయన మనసు కలత చెందింది. ఇదే విషయాన్ని తన గురువు బాలగంగాధర తిలక్ వద్ద ప్రస్తావించారు. ‘‘మనం బ్రిటిషు పాలనలో ఉన్నాం. త్వరలోనే విముక్తి లభిస్తుంది. మనకు ఒక జెండా ఏర్పడుతుంది’’ అన్న తిలక్ మాటలు పింగళి మనసులో కొత్త ఆలోచనలకు బీజం వేశాయి. అప్పుడు పింగళి జాతీయ జెండా ప్రాధాన్యతను గుర్తించి, వివిధ దేశాల జెండాలను పరిశీలించారు. సుమారు 30 నమూనాలను మన దేశం కోసం తయారు చేశారు. ఈ క్రమంలో మరికొందరు దేశభక్తులు కూడా జాతీయ జెండా నమూనాలు రూపొందించే ప్రయత్నం చేశారు. పింగళి 1916లో ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ (భారతదేశానికి ఒక జాతీయ పతాకం) పుస్తకాన్ని రచించారు. ఇందులోని ప్రధాన అంశాలు ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికల్లో ప్రముఖంగా వెలువడ్డాయి. అప్పటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు దాదాబాయ్ నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఈ పుస్తకాన్ని కొనియాడారు. ఇది గాంధీ దృష్టికి వెళ్లింది.
మహాత్ముని కోరిక మేరకు..
1921 సంవత్సరం మార్చి 31, ఏప్రిల్ ఒకటవ తేదీలలో విజయవాడలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్న సమయంలో గాంధీని పింగళి కలిశారు. మహాత్ముని అభీష్టం మేరకు తొలుత కేవలం ఎరుపు, పచ్చ రంగులతో జాతీయ జెండా నమూనాను రూపొందించారు. ఆ తర్వాత గాంధీ సూచన మేరకు తెలుపు రంగును కూడా చేర్చడంతో త్రివర్ణ పతాకం రూపొందింది. మధ్యలో రాట్నం గుర్తు ఉంచారు. కాలక్రమేణా అనేక మార్పులు జరిగి, 1947 స్వాతంత్య్రం వచ్చే నాటికి మూడు రంగుల జాతీయ జెండాలో అశోక చక్రం చేరింది. జాతీయ జెండా రూపకల్పనలో పింగళి కృషిని మహాత్మా గాంధీ ‘ది యంగ్ ఇండియా’ పత్రికలో తాను రాసిన వ్యాసంలోనూ కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2021 మార్చి 12న మాచర్లలో పింగళి కుమార్తె సీతామహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు. మెమెంటోను, రూ.75 లక్షల చెక్కుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ జీఓను అందజేశారు. తర్వాత కాలంలో సీతామహాలక్ష్మి మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. 2022 ఆగస్టు 15 వరకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పింగళి జయంతిని కూడా ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. అదే ఏడాది జనవరి 3న గుంటూరు కలెక్టరేట్‌లో పింగళి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధులకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ ఇటువంటి సేవ చేయలేదు. పింగళి కుమార్తెతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.


