మద్యం మత్తులో కారుతో బీభత్సం | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కారుతో బీభత్సం

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

మద్యం మత్తులో కారుతో బీభత్సం

అతివేగంగా వచ్చి స్తంభాన్ని ఢీకొట్టిన యువకులు రెండు ముక్కలైన విద్యుత్‌ స్తంభం కనీసం పట్టించుకోని పోలీసులు కారులో వచ్చిన వారు పరారీ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

లక్ష్మీపురం: మద్యం మత్తులో గుర్తు తెలియని యువకులు అతివేగంగా వచ్చి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బీభత్సం సృష్టించి అక్కడి నుంచి పరారైన ఘటన గురువారం రాత్రి స్థంభాలగరువులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థంభాలగరువు ప్రాంతంలోని డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లే దారి మార్గంలో ఓ కారులో కొందరు యువకులు మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ వచ్చారు. అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది రెండు ముక్కలైంది. విద్యుత్‌ తీగలు నేలపై పడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. యువకులు బయటపడి అక్కడి నుంచి పరారయ్యారు. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. కారు నడిపిన వేగానికి ముందు భాగంలో ఉన్న బెలూన్‌ సైతం బయటకు వచ్చింది. కారు ధ్వంసం కావడంతోపాటు స్తంభం సైతం రెండు ముక్కలైంది. విద్యుత్‌ తీగలు కిందకు జారిపడిపోయాయి. కాస్త అటూఇటు అయి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉండేదని భావిస్తున్నారు. ఆ యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటన తర్వాత మూడు గంటల వరకు పోలీసులు స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

అతివేగంగా వచ్చిన కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆ స్తంభం రెండు ముక్కలు అయింది. తీగలు కిందకు పడిపోయాయి. దీంతో స్థానికంగా విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రమాదం చోటుచేసుకున్న వైనాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు తమకు సంబంధం లేదని చెప్పారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులైనా నిందితులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement