గుంటూరు మెడికల్: రెండేళ్లకు ఒకసారి 15 శాతం చొప్పున స్టయిఫండ్ పెంచాల్సి ఉన్నా... ఈ ఏడాది జనవరి నుంచి ఆ పని చేయలేదని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యు.ఈశ్వర్‌శంకర్ చెప్పారు. ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సమ్మె చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మె గురువారంతో మూడో రోజుకు చేరుకుంది. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరయ్యారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని బైఠాయించారు. తర్వాత డాక్టర్ యు.ఈశ్వర్‌శంకర్ మాట్లాడుతూ తగినంత విశ్రాంతి లేకుండా జూనియర్ డాక్టర్లు పేద రోగుల కోసం విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్టయిఫండ్‌ను పెంచకుండా తాత్సారం చేయడం భావ్యం కాదన్నారు. సమ్మెకు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జీడీ ఏఏపీ) రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్వరూప్‌కాంత్, కట్టా శ్రీనివాసరావు, యూనియన్ నేతలు రమ్య, మారుతీదేవి, అరుణదేవి, శివగోపాల్, రాజా, అజయ్, మురళి, తదితరులు తమ సంఘీభావం తెలియజేశారు. జూడాల సమ్మె వద్దకు చేరుకుని వారికి పూలమాలలు వేసి మద్దతు పలికారు. డాక్టర్ స్వరూప్‌కాంత్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు పనిచేస్తేనే ఆసుపత్రి సక్రమంగా నడుస్తుందన్నారు. వారికి తప్పనిసరిగా స్టయిఫండ్ పెంచాలని చెప్పారు. సమ్మెలో జూడాల సంఘం గుంటూరు శాఖ వైస్ ప్రెసిడెంట్స్ ఎ.వి.కృష్ణచౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్ సోహిల్ అలీ, జనరల్ సెక్రటరీలు జగదీష్ గాదె, పి.ఎస్.వి.కల్యాణి, డాక్టర్ విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు జేత్ర మర్రిపాటి, అనురాగ్, జాయింట్ సెక్రటరీలు బి.వంశీకృష్ణ, బి.స్నేహసాహిత్య, జి.రాధిక, కునపవర్ కార్తీక్, నిషిరాగ్ బికుంతె, పి.సందీప్‌కుమార్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు ఎన్.సాయిప్రదీప్, ఉదయ్‌సాగర్, సాయిప్రదీప్, తరుణ్‌కుమార్, హేమంత్‌నాయక్ పాల్గొన్నారు.
సీనియర్ వైద్యుల సంఘీభావం


