గుంటూరు లీగల్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కోర్టు న్యాయవాదులు గురువారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, సమానత్వం భావాలను ప్రజల్లో మరింతగా పెంపొందించాలనే సందేశంతో ఈ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి న్యాయవాదులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని తెలుగుతల్లి విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశాన్ని ఇచ్చారు. ర్యాలీలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.


