‘ప్రతీ నీటి బొట్టూ మా రెడ్‌లైన్‌’.. భారత్‌కు పాక్‌ హెచ్చరిక! | Every Drop of Water Is Our Red Line Pakistan Warns India | Sakshi
Sakshi News home page

‘ప్రతీ నీటి బొట్టూ మా రెడ్‌లైన్‌’.. భారత్‌కు పాక్‌ హెచ్చరిక!

Aug 14 2026 12:22 PM | Updated on Aug 14 2026 12:28 PM

Every Drop of Water Is Our Red Line Pakistan Warns India

ఇస్లామాబాద్‌: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య నీటి వివాదం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన నేపథ్యంలో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘పాకిస్తాన్‌ నీటిలో ప్రతి ఒక్క చుక్కా మా రెడ్‌లైన్‌’ అంటూ భారత్‌ను ఆయన హెచ్చరించారు. భారత్‌ తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా స్పందిస్తామని వ్యాఖ్యానించారు.

శాంతి గురించి మాట్లాడుతూనే.. భారత్‌కు హెచ్చరికలు జారీ చేయడం పాకిస్థాన్‌ రాజకీయాల్లోని ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చకు దారితీసింది. ఓవైపు శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే.. మరోవైపు నీటి విషయంలో ఎలాంటి చర్యనైనా సహించేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

అసలు వివాదం?
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్‌, పాక్‌ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ వ్యవస్థలోని నీటిని రెండు దేశాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఈ ఒప్పందం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సింధు, జీలం, చీనాబ్‌ నదులను ప్రధానంగా పాకిస్తాన్‌కు, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులను భారత్‌కు కేటాయించింది. అయితే ఇరు దేశాలకు కొన్ని పరిమిత వినియోగ హక్కులను కూడా ఒప్పందం కల్పించింది. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ దాడికి పాక్‌ మద్దతున్న ఉగ్రవాదులే కారణమని భారత్‌ ఆరోపించింది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై తీసుకున్న కీలక చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ ‘అబేయన్స్‌’లో ఉంచింది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్‌ మొదలైంది.

భారత్‌ ట్విస్ట్‌.. 
ఒప్పందం అమలులో ఉన్న సమయంలో భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు నదుల నీటి మట్టాలపై కీలక సమాచార మార్పిడి జరిగేది. ముఖ్యంగా వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం పెరిగితే ముందస్తు హెచ్చరికలు పాకిస్తాన్‌కు ఉపయోగపడేవి. ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ సమాచారాన్ని పంచుకోవడం కూడా భారత్‌ ఆపేసింది. దీంతో నీటి అంశం కేవలం రెండు దేశాల మధ్య జల వివాదంగా కాకుండా.. భద్రత, ఉగ్రవాదం, దౌత్యం, రాజకీయ ఒత్తిడి అన్నీ కలిసిన పెద్ద అంశంగా మారింది. ఇప్పుడు షెహ్‌బాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలు కూడా అదే రాజకీయ నేపథ్యంలో చూడాల్సి ఉంది. “మేము శాంతిని కోరుకుంటున్నాం.. కానీ మా శాంతిని బలహీనతగా భావించొద్దు” అంటూ ఆయన ఒకవైపు చెబుతూనే.. భారత్‌ తమ నీటి హక్కులను ప్రభావితం చేసే చర్యలు తీసుకుంటే గట్టిగా స్పందిస్తామని హెచ్చరించారు. అంటే.. శాంతి సందేశమా? లేక రాజకీయ హెచ్చరికా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

పాక్‌ మాత్రం సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిలిపివేసిందని ఆరోపిస్తోంది. తమకు ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉందని వాదిస్తూ అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. కానీ, భారత్‌ మాత్రం ఉగ్రవాదాన్ని ఒకవైపు, నీటి సహకారాన్ని మరోవైపు విడదీసి చూడాలనే పాక్‌ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే నీటి విషయంలో పాత ఒప్పందం ప్రకారం హక్కులు కావాలనుకోవడం ఎలా? అన్నది భారత రాజకీయ వాదనలో కీలక అంశంగా మారింది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్‌కు పెద్ద సవాలుగా మారుతోంది. ఎందుకంటే నీటి అంశాన్ని అంతర్జాతీయ ఒత్తిడి కోసం ఉపయోగించాలనుకుంటున్న ఇస్లామాబాద్‌కు.. భారత్‌ మాత్రం దీనిని తన భద్రతా ప్రయోజనాలతో ముడిపెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement