వాషింగ్టన్ డీసీ: అమెరికా ఆయుధ సంపత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక దళంతో పాటు ఆధునిక యుద్ధ నౌకలు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల సైనిక స్థావరాలతో ఆ దేశం ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. అయితే శత్రుదుర్బేద్యంగా కనిపించే వాషింగ్టన్.. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం చేతిలో చతికిలపడాల్సి వచ్చింది. అవును ఇది అక్షరాల నిజం ఇటీవల జర్మనీలో జరిగిన "కంబైన్డ్ రిజాల్వ్" సైనిక విన్యాసంలో ఉక్రెయిన్ డ్రోన్లు అమెరికా దళాలను ముప్పుతిప్పలు పెట్టాయి.
వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ప్రకారం.. జర్మనీలో జరిగిన 'కంబైన్డ్ రిజాల్వ్' సైనిక విన్యాసాలలో ఉక్రెయిన్ డ్రోన్ ఆపరేటర్లు అమెరికా బలగాలను, వారి సాయుధ వాహనాలను పదేపదే గుర్తించి మరీ 'నాశనం' చేశారని తెలిపింది. ఒక దశలో ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు ఏకంగా ఒక పూర్తి అమెరికన్ ఆర్మర్డ్ బ్రిగేడ్ (సాయుధ దళాన్ని) తుడిచిపెట్టేశాయని అమెరికా అధికారులే స్వయంగా వెల్లడించినట్లు పేర్కొంది. రష్యాతో గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధ అనుభవం ఉక్రెయిన్‌కు డ్రోన్ల వినియోగంలో అపారమైన నైపుణ్యాన్ని ఇచ్చింది. ఈ రకమైన ఆధునిక యుద్ధ పద్ధతులను నేర్చుకోవడానికి అమెరికా సైన్యం ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిపింది.
అయితే ఈ విన్యాసంలో నేరుగా మందుగుండు సామాగ్రి ఉపయోగించరు. డ్రోన్లు వాహనాలపై నుండి లేదా వాటికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు, పరిశీలకులు ఆ వాహనం వర్చువల్‌గా 'నాశనమైంది' అని ప్రకటిస్తారు. ఉక్రెయిన్ దళాలు ఎంత వేగంగా అమెరికా వాహనాలను కూల్చేసాయంటే, కొన్ని వాహనాలను నాశనమైనట్లు ప్రకటించి మళ్లీ బతికించి కొత్త యూనిట్లుగా విన్యాసాల్లోకి పంపాల్సి వచ్చింది. అయితే రెండు వారాల పాటు సాగిన ఈ డ్రిల్ తర్వాత అమెరికా సైనికులు క్రమంగా పరిస్థితులకు అలవాటు పడ్డారు. వారు తమ దళాలను విడదీయడం, కదలికలను దాచడం మరియు శత్రువుల కంటికి పడకుండా ఉండటానికి 'ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్' పద్ధతులను ఉపయోగించడం నేర్చుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
అనంతరం ఉక్రెయిన్ దళాలు అమెరికన్లకు డ్రోన్లను ఆఫెన్సివ్‌గా (దాడి చేయడానికి) ఎలా వాడాలో శిక్షణ కూడా ఇచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విధమైన శిక్షణ అమెరికాలో దొరకదని '"ఇలాంటి అద్భుతమైన శిక్షణ అమెరికాలో దొరకడం అసాధ్యం" అని నాటో సైనికదళం నాయకుడు ఎయిర్ ఫోర్స్ జనరల్ అలెక్సస్ గ్రింకెవిచ్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ దళాలతో శిక్షణ పొందిన తర్వాత నాటో సైన్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
డ్రోన్ల వినియోగంలో ఉక్రెయిన్ ముందంజ
ఉక్రెయిన్ కేవలం డ్రోన్లను ఎగరేయడమే కాకుండా, యుద్ధ రంగంలో అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవడం, వాటిని రిపేర్ చేయడం మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడంలో నైపుణ్యం సాధించింది. కానీ, అమెరికా సైనికులకు యుద్ధ రంగంలో దాడి జరుగుతున్నప్పుడు డ్రోన్లను రిపేర్ చేయడం లేదా ఆయుధాలను అమర్చడంలో అనుభవం చాలా తక్కువగా ఉంది. డ్రోన్ల కోసం అమెరికా బిలియన్ల ఖర్చు.. కానీ మారిన వ్యూహంసుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్ల సాంకేతికతను ఆధునిక యుద్ధాలలో చేర్చడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాయి.
పెంటగాన్ కొత్త డ్రోన్లు మరియు కౌంటర్-డ్రోన్ వ్యవస్థల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసింది. కానీ ప్రస్తుతం యుద్ధ రంగం మారిపోయింది. ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోంది అమెరికా తయారు చేసిన ఖరీదైన, అధునాతన లాంగ్-రేంజ్ డ్రోన్లు కావు. చిన్నవి, చౌకైన ఫ్రంట్‌లైన్ డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతూ, యుద్ధ నిఘా సమాచారంతో కలిపితే ఎంతటి విధ్వంసం సృష్టించవచ్చో ఉక్రెయిన్ నిరూపించింది. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ దాడుల్లో అమెరికా సైనికులు మరణించడమే కాకుండా, ఆయుధాలు, విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.
కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. గత ఆరు నెలలుగా అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తున్నా యుద్ధం కొలిక్కి రాలేదు. వారంలోనే యుద్ధాన్ని ముగిస్తానని బింకాలు పలికిన ట్రంప్ యుద్ధం ఎలా ముగించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా ఆధునాతన డ్రోన్ల వినియోగంలో అమెరికా వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది.
ఈ ఆపరేషన్ ఏంటి?
అమెరికా వాహనాలను ముప్పతిప్పలు పెట్టిన డ్రోన్లు'కంబైన్డ్ రిజాల్వ్' అనేది మైదాన ప్రాంత యుద్ధాలపై ఆధారపడిన భారీ స్థాయి ఆర్మీ విన్యాసం. ఇందులో అమెరికా దళాలు సాయుధ వాహనాలు, పదాతి దళం, హెలికాప్టర్లు మరియు డ్రోన్లతో పాల్గొంటాయి. అయితే, ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు చాలా వేగంగా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి పారేశాయి. ఇలాంటి విన్యాసాల్లో నిజమైన మందుగుండు సామగ్రిని ఉపయోగించరు. ఈ విన్యాసాలు వాస్తవ యుద్ధ పరిస్థితులలో లోపాలను గుర్తించడానికి నిర్వహించబడ్డాయి.


