రష్యాలోని ఓ ప్రధాన రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మాస్కో ప్రధాన చమురు రంగాన్ని దెబ్బతీయడానికి కీవ్ గత కొన్ని నెలలుగా దాడులు చేస్తోంది. గత మూడు రోజుల్లో జరిగిన నాలుగో దాడి ఇది. సరిహద్దుకు 800 మైళ్ల దూరంలో ఉన్న చమురు క్షేత్రాన్ని కీవ్ టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో రిఫైనరీ ధ్వంసమవ్వగా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన ఉత్పాదక దేశాలలో ఒకటి. ఉక్రెయిన్‌పై తన సైనిక చర్యను కొనసాగించడానికి చమురు పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయమే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. ఈ దాడుల కారణంగా రష్యా రిఫైనరీ సామర్థ్యం తగ్గి.. గ్యాస్ స్టేషన్‌లలో ఇంధన కొరత ఏర్పడుతోంది. ఈ దాడుల ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను శాంతి ఒప్పందానికి అంగీకరించేలా ఒత్తిడి చేయడమే తమ లక్ష్యమని కీవ్ అధికారులు చెబుతున్నారు.
రష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్‌లో ఉన్న 'గాజ్‌ప్రోమ్ నెఫ్తెఖిమ్ సలావత్' చమురు శుద్ధి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై తమ బలగాలు రాత్రి సమయంలో దాడి చేశాయి. దీంతో ఆ కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ తెలిపింది. మాస్కోకు ఆగ్నేయంగా.. ఉక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 1,300 కిలోమీటర్ల (800 మైళ్ళు) దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్ రష్యాలోని అతిపెద్ద చమురు శుద్ధి, పెట్రోకెమికల్ కేంద్రాలలో ఒకటని.. జనరల్ స్టాఫ్ టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 74 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసి, పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుందని వెల్లడించింది.
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని ఓర్స్క్ రిఫైనరీ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో దెబ్బతిన్న విదేశీ పరికరాలను మరమ్మతు చేయడానికి ఆరు నెలల వరకు సమయం పట్టవచ్చని ఒరెన్‌బర్గ్ ప్రాంత గవర్నర్ యెవ్జెనీ సోల్ంట్సేవ్ తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
ఒడెసా ప్రాంతంలో ప్రయాణికుల రైలుపై షాహెద్ డ్రోన్ దాడి చేయడంతో ఇంజనీర్, అతని సహాయకుడు మృతి చెందారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా తయారీ పాట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు అత్యవసరం. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా వీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


