పుతిన్‌ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు.. జెలెన్‌స్కీ | russia ukraine war vladimir putin to mobilise 5 lakh fighters | Sakshi
Sakshi News home page

పుతిన్‌ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు.. జెలెన్‌స్కీ

Aug 10 2026 8:02 PM | Updated on Aug 10 2026 8:17 PM

russia ukraine war vladimir putin to mobilise 5 lakh fighters

కీవ్‌:ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీనికొరకే త్వరలో భారీ స్థాయిలో సైనికుల సమీకరణ చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో జరిగే రష్యా దిగువ సభ ఎన్నికల తర్వాత ఈ ఆపరేషన్‌ చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల వరుసగా డ్రోన్‌ దాడులు చేస్తోంది. ఈ దాడులలో పెద్దఎత్తున పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఈ రోజు (సోమవారం) రష్యాలోని తతార్‌స్తాన్ ప్రాంతంపై ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో కనీసం 13 మంది మరణించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌ జరిపిన అత్యంత ప్రాణాంతక దాడుల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన ఆర్టిలరీ దాడిలో ఐదుగురు మరణించారు. 

ఈ ఉద్రిక్తతల నడుమ జెలెన్‌స్కీ  సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందన్నారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. "రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం  చేసే అవకాశం ఉంది. ఇందుకోసం 5 లక్షల మంది కొత్త సైనికులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌ 21న జరిగే రష్యా డ్యూమా ఎన్నికల తర్వాత ఈ సమీకరణ చేపట్టాలని పుతిన్ భావిస్తున్నారు. రష్యా ప్రజల్లో వ్యతిరేకత భయంతో పుతిన్ ఈ ప్రక్రియను బహిరంగంగా చేపట్టకపోవచ్చు" అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

కాగా ఇటీవల టర్కీ విదేశాంగశాఖ మంత్రి హకాన్ ఫిదాన్ సంచలన ప్రకటన చేశారు." ఉక్రెయిన్‌ రష్యా భూభాగంలోకి సుదూర డ్రోన్‌ దాడులను పెంచుతున్న నేపథ్యంలో పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. యుద్ధం ముందు వరుస నుంచి రష్యా భూభాగంలోకి కూడా తీవ్రంగా విస్తరిస్తే, రష్యా తన ఉనికినే కాపాడుకునే చివరి మార్గంగా అణ్వాయుధాలను ఉపయోగించే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement