ఇంతకాలం పశ్చిమాసియా యుద్ధం అనగానే మనం ఇజ్రాయెల్, హమాస్ లేదా ఇరాన్ గురించే మాట్లాడుకుంటాం. కానీ తెర వెనుక అంతకంటే ప్రమాదకరమైన మరో యుద్ధం మొదలైంది..! అదే.. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా - యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న మరో భీకర యుద్ధం.. దాని గురించి తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండీ!
కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ షిప్పింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న హౌతీలు.. ఇప్పుడు నేరుగా సౌదీ అరేబియాను టార్గెట్‌గా మార్చుకున్నారు. జూలై 20న సౌదీ నౌకలపై ఏకంగా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం రెండు రోజుల్లోనే సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. దీంతో సౌదీకి వెళ్లాల్సిన ఓడలకు బ్రేకులు పడ్డాయి. అసలు సౌదీకి, హౌతీలకు మధ్య వైరానికి కారణం ఏమిటి? ఈ సరికొత్త ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను, ముఖ్యంగా చమురు మార్కెట్లను ఎలా ప్రభావితం చేయబోతున్నాయనే వివరాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
హౌతీలు – సౌదీ మధ్య వివాదం కొత్తదేం కాదు. దీని మూలాలు దశాబ్దాల నాటివి. 2015లో యెమెన్ అంతర్యుద్ధంలోకి సౌదీ అరేబియా నేరుగా జోక్యం చేసుకుంది. ఉత్తర యెమెన్‌ను హౌతీలు ఆక్రమించుకున్న తర్వాత, అక్కడ చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టడానికి సౌదీ సైన్యం భారీ వైమానిక దాడికి దిగింది. ఆ తర్వాత ఏడేళ్ల పాటు దారుణమైన యుద్ధం జరిగింది. సౌదీ విమానాలు యెమెన్‌పై బాంబుల వర్షం కురిపిస్తే.. హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో సౌదీ నగరాలు, విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేశారు. చివరకు 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ, యెమెన్‌పై ఉన్న ఆర్థిక.. రవాణా ఆంక్షలను సౌదీ పూర్తిగా ఎత్తివేయలేదు. సరిగ్గా ఇదే ఇప్పుడు హౌతీలకు కోపం తెప్పించింది. ‘‘మీరు మా గగనతలాన్ని, సముద్ర మార్గాలను దిగ్బంధిస్తే.. మేం కూడా మీ షిప్పింగ్‌ను అడ్డుకుంటాం’’ అంటూ హూతీలు కవ్వింపు చర్యలకు దిగారు.
ఇక్కడ అసలు సమస్య భౌగోళిక వ్యూహానిది అంటే.. Geopoliticsది. ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా ఆయిల్ రవాణాకు 'బాబ్ అల్-మందబ్' (Bab el-Mandeb) జలసంధి ఎంతో ముఖ్యం. హిందూ మహాసముద్రం నుంచి సూయజ్ కాలువకు వెళ్లాలన్నా, ఐరోపా మార్కెట్లకు చేరుకోవాలన్నా ఈ సన్నని జలసంధి మీదుగానే ఓడలు ప్రయాణించాలి. ఇరాన్‌తో జరుగుతున్న ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల సౌదీ తన ప్రధాన ఆయిల్ ఎగుమతి మార్గమైన Strait of Hormuz ద్వారా రవాణాను తగ్గించుకుంది. దానికి బదులు.. దేశం తూర్పు భాగం నుంచి పశ్చిమాన ఉన్న ఎర్ర సముద్ర తీరంలోని 'యాన్బు' పోర్టుకు ఆయిల్‌ను చేరవేసే ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో జూన్ నుంచి యాన్బు పోర్టు ద్వారా రోజుకు దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఎగుమతి అవుతోంది. అంటే.. సౌదీ తన ఆయిల్ ఎగుమతులను ఒక ప్రమాదకర చోక్‌పాయింట్ నుంచి తప్పించి, మరో చోక్‌పాయింట్‌పై అంటే.. ఎర్ర సముద్రం మార్గంపై ఎక్కువగా ఆధారపడేలా చేసుకుంది. హౌతీలు సరిగ్గా ఇదే బలహీనతను పట్టుకున్నారు..! సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే దాడులు చేస్తూ సౌదీ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూస్తున్నారు.
ఈ ఉద్రిక్తతల వెనుక ఇరాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ట్రిపుల్ హెచ్ అని పిలిచే మిలిటెంట్ సంస్థలు.. అవే.. హమాస్, హిజ్బుల్లా, హౌతీలను పెంచి పోషిస్తోంది ఇరాన్ అనేది బహిరంగ రహస్యం..! అమెరికా వైమానిక దాడులు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరాన్ తన మిత్రపక్షమైన హౌతీలను ఉసిగొల్పుతోందన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు.. పరిస్థితుల ప్రతికూలతల కారణంగా.. సౌదీ అరేబియా మరో యుద్ధానికి వెళ్లేందుకు సుముఖంగా లేదు. గత నాలుగేళ్లుగా ఆ యుద్ధం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న రియాద్‌కు, ఇప్పుడు హౌతీల నుంచి వస్తున్న ఈ సవాళ్లు పెనుభారంగా మారాయి.
మరి సౌదీ దీనికి ఎలా స్పందిస్తుంది?
ఒకటి.. పరిమిత దాడుల ఆలోచనకు దిగొచ్చు. అంటే.. హౌతీల లాంచర్లు, డ్రోన్ బేస్‌లపై మాత్రమే చిన్నపాటి దాడులు చేసి ఊరుకోవడం. రెండోది.. పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగడం. ఒకవేళ సౌదీ గనుక సనా ఎయిర్‌పోర్టు లేదా హౌతీ నేతలపై సర్వశక్తులతో విరుచుకుపడితే.. అది మరోసారి పూర్తిస్థాయి అంతర్యుద్ధానికి దారితీస్తుంది. అంతేకాదు, అమెరికా.. ఇజ్రాయెల్ కూడా ఇందులో నేరుగా జోక్యం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు ఈ ప్రాంతంలో శాంతి కలకాలం మృగ్యమౌతుంది. ప్రస్తుతానికైతే.. ఇటు సౌదీ అరేబియా.. అటు హౌతీలు.. ఇద్దరూ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి దిగే ప్రమాదాలు పెద్దగా లేవు
హౌతీలు సౌదీతో చర్చలు జరిపి Funds లేదా Airport restrictions తొలగింపు వంటి కొన్ని వెసులుబాట్లను పొందాలని చూస్తున్నారు. మరోవైపు సౌదీ తన ఆయిల్ ట్రేడ్‌ను, నగరాలను రక్షించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. కాని ఇక్కడ మార్జిన్ చాలా తక్కువ..! ఇక్కడ జరిగే ఒక చిన్న తప్పు లేదా పొరపాటు మొత్తం పశ్చిమాసియాను మరోసారి అగ్నిగుండంలోకి నెట్టగలదు.సౌదీ అరేబియా తన చమురు మార్గాలను ఎలా కాపాడుకుంటుంది? హౌతీల దూకుడుకు అమెరికా ఎలా స్పందిస్తుంది?’’ అనే దానిపైనే రాబోయే కాలంలో అంతర్జాతీయ ఆయిల్ ధరలు, గ్లోబల్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి.


