హసీనా తిరిగి వస్తే అధికార పీఠం కదిలిపోతుందా..? | what happens if Sheikh Hasina returns to Bangladesh | Sakshi
Sakshi News home page

హసీనా తిరిగి వస్తే అధికార పీఠం కదిలిపోతుందా..?

Aug 10 2026 7:06 PM | Updated on Aug 10 2026 7:48 PM

what happens if Sheikh Hasina returns to Bangladesh

గత వారం షేక్ హసీనా చేసిన ప్రసంగం ఒక ముఖ్యమైన రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, ఆమెకు ఉన్న మద్దతు స్థాయి ఎంత? అది ఎంత విస్తరించి ఉందో అంచనా వేసే ప్రయత్నం కూడా. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్, సౌత్ ఏషియా వర్చువల్‌గా నిర్వహించింది. తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని, దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ప్రాణాలకు ముప్పు వచ్చినా సిద్ధంగా ఉన్నానని హసీనా ప్రకటించారు. 

తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వం, స్వాతంత్య్ర  పోరాటం, 1971 విమోచన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, 1981, 1983, 1985 సంవత్సరాల్లో తన ప్రవాస జీవితం, అరెస్టు, 2004 హత్యాయత్నాన్ని గుర్తుచేశారు. అయితే 2007లో అప్పటి సైన్య మద్దతు ఉన్న కేర్‌టేకర్ ప్రభుత్వం తన ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం, ఢాకాలో లభించిన భారీ స్వాగతాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.

ఇది రానున్న డిసెంబరులో ఆమె తిరిగి బంగ్లాదేశ్‌కు రావాలనే యత్నానికి ముఖ్యమైన సూచనగా నిలుస్తోంది. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, హసీనా ప్రతిపాదించిన పునరాగమనం బంగ్లాదేశ్‌లో రాజకీయ పోటీని మళ్లీ తెరపైకి తీసుకువస్తుందా? లేక ఇప్పటికే ఉన్న వ్యవస్థలో విభేదాలను మరింత పెంచుతుందా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే అవామీ లీగ్ భవిష్యత్తు, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలు, భారతదేశంతో సంబంధాలను నిర్దేశించనుంది.

హసీనా మూడు ప్రధాన డిమాండ్లు ముందుంచారు. అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేయాలి, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను పునరుద్ధరించాలి. జులై ఉద్యమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపొందించారని మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యను ఆమె ప్రస్తావించారు. 2024 ఉద్యమం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే అంశానికి దీన్నే ఆధారంగా చూపించారు. న్యాయపరమైన దర్యాప్తులు అడ్డుపడుతున్నాయని, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

రెండు సంకేతాలు 
ఇందులో రెండు సంకేతాలు ఉన్నాయి. మొదటిది, “1971 స్ఫూర్తి” ప్రాధాన్యాన్ని, అవామీ లీగ్ వారసత్వాన్ని మళ్లీ బలంగా నిలబెట్టడం. రెండోది, తన పునరాగమనానికి రాజకీయ వాతావరణాన్ని సిద్ధం చేయడం. ఆసక్తికర అంశం ఏమిటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా 1971 వారసత్వానికి తామే సంరక్షకులమని చెబుతోంది. వారి వాదన ప్రకారం సాయుధ పోరాటానికి జనరల్ జియౌర్ రెహ్మాన్ నాయకత్వం వహించారని, ఆయనే బంగ్లాదేశ్ విమోచన ప్రకటన చేశారని చెబుతున్నారు. అయితే ముజిబ్ హత్య తర్వాత రెహ్మాన్ కూడా పాకిస్థాన్ తరహాలోనే ఇస్లామిక్ రాజకీయాలను రాజ్యాంగబద్ధం చేసే ప్రయత్నం చేశారు.

అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బీఎన్‌పీ రాజకీయాలు అవామీ లీగ్‌కు ప్లేస్‌ ఇవ్వడం లేదు. భారత భూభాగం నుంచి షేక్ హసీనా ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడడంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2013 ఒప్పందం కింద ఆమెను అప్పగించాలని తమ డిమాండ్‌ను ప్రభుత్వం మళ్లీ పునరుద్ఘాటించింది. భారత భూభాగం నుంచి ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం ద్వైపాక్షిక సంబంధాలపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారికంగా తెలిపింది.

ఇక్కడ చారిత్రక నేపథ్యం చాలా ముఖ్యమైనది. బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రతి ప్రధాన రాజకీయ మార్పులో భారత అంశం కనిపించింది. 1971 విమోచన యుద్ధం నుంచి హసీనా ప్రవాస జీవితం వరకు ఇదే పరిస్థితి. రాజ్యాంగేతర ఏర్పాట్ల కంటే ప్రజాస్వామ్య రాజకీయాలకే భారత్ ఎప్పుడూ మద్దతు ఇచ్చింది. అయితే తన చివరి పాలనా కాలంలో హసీనా రాజకీయ ప్రత్యర్థులకు తగిన ప్లేస్‌ ఇవ్వలేదు. దీనిపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.

నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోనే అత్యంత పురాతన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్‌కు బంగ్లాదేశ్ అంతటా బలమైన ఉనికి, మద్దతు ఉంది. ఇటీవల ముగిసిన ఫిబ్రవరి ఎన్నికలు సమగ్రంగా జరిగి ఉంటే అవామీ లీగ్ రెండో అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచే అవకాశం ఉండేది. ప్రజాభిప్రాయ సర్వేల ప్రకారం ఇప్పటికీ దాదాపు 30 శాతం ఓటర్లపై ఆ పార్టీ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో హసీనా తిరిగి వస్తే, 2007లో జరిగినట్టే ఆమెకు స్వాగతం పలకడానికి మద్దతుదారులు వీధుల్లోకి రావచ్చు. ప్రస్తుత వ్యవస్థకు ఇది రాజకీయ అసౌకర్యాన్ని కలిగిస్తోంది.

అవామీ లీగ్ వేగంగా పునర్వ్యవస్థీకరణ? 
రాజకీయ కార్యకలాపాలు తిరిగి తెరుచుకుంటే అవామీ లీగ్ వేగంగా పునర్వ్యవస్థీకరణ చెందవచ్చనే ఆందోళన వారికి ఉంది. అందుకే హసీనా ప్రసంగాన్ని బంగ్లాదేశ్‌లో ప్రసారం చేయనివ్వలేదు. ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ ఇప్పటికీ ప్రజలపై బలమైన పట్టు సాధించలేదు. మరోవైపు జమాత్-ఇ-ఇస్లామీకి అవామీ లీగ్‌తో చాలా కాలంగా ఉన్న విభేదాల నేపథ్యంలో, జమాత్ తీవ్రవాద రాజకీయాలను నియంత్రించేందుకు అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలను తారిక్ రెహ్మాన్ అనుమతించే అవకాశం ఉంది.

ఢాకాతో సంబంధాల్లో సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్‌ రెహ‍్మాన్‌ను ఆహ్వానించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢాకా వెళ్లారు. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తారిక్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. 

అయినప్పటికీ ఈ ప్రయత్నాల వల్ల స్పష్టమైన రాజకీయ హామీ గానీ, విశ్వాసం గానీ ఏర్పడలేదు. భారత్‌తో మరింత దగ్గరవ్వాలనే విషయంలో తారిక్ రెహ్మాన్ సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది. తన తొలి విదేశీ పర్యటనలకు ఆయన మలేషియా, ఆ తర్వాత చైనాను ఎంచుకున్నారు. చైనా పర్యటనలో మోంగ్లా పోర్టు వంటి సున్నిత అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఇవి భారత్ భద్రతా ఆందోళనలకు కారణమవుతున్నాయి.

ఇరు దేశాల మధ్య ఇంకా పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. మొదటిది 1996 గంగా జల ఒప్పందం పునరుద్ధరణ. దీనిపై బిహార్, పశ్చిమ బెంగాల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండోది తీస్తా జలాల పంపిణీ ఒప్పందం. మూడోది షేక్ హసీనా అధికారిక అప్పగింత. నాలుగోది సరిహద్దు వాణిజ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం. బంగ్లాదేశ్ మారుతున్న రాజకీయాలు, వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాలకు మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అప్పగింత విషయానికి వస్తే, రాజకీయ నేరాల కేసుల్లో దాన్ని తిరస్కరించే అవకాశం ఒప్పందంలో ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆర్టికల్ 6 రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులపై అప్పగింతను నిరాకరిస్తుంది.

వనరులు, అనుసంధానం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో ఇరు దేశాలు సంక్లిష్ట పరస్పర ఆధారిత సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత ఈశాన్య ప్రాంత అభివృద్ధి, బంగ్లాదేశ్ అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రాజకీయ విభేదాలు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాంతీయ పురోగతి వంటి పెద్ద లక్ష్యాలను మసకబార్చకుండా ఢిల్లీ, ఢాకా చూసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement