గతేడాది కన్నా 20–30 శాతం అధిక ధరలకు అవకాశం
ముడి సరుకుల రవాణా, వాటర్ ట్యాంకర్ల చార్జీల పెరుగుదలే కారణం
తయారీదారులు, వర్క్‌షాపుల యజమానుల స్పష్టీకరణ
ముంబై: పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇంధన ధరలతోపాటు ఈసారి గణేశ్ విగ్రహాల ధరలు కూడా ఏకంగా 20–30 శాతం పెరిగే అవకాశముండటంతో గణేశ్ భక్తులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. గణేశోత్సవాలు సమీపిస్తుండటంతో వర్క్ షాపుల్లో వినాయకుని విగ్రహాల తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్మంగా రాయ్‌గడ్ జిల్లా పేణ్ తాలూకాలో తయారైన చిన్న, పెద్ద విగ్రహాలు విదేశాలకు ఏప్రిల్‌లోనే రవాణా అయ్యాయి. ప్రస్తుతం ముంబై, థానే, న్యూ ముంబై, కల్యాణ్, రాయ్‌గడ్, నాసిక్, పుణే తదితర నగరాలకు అవసరమయ్యే విగ్రహాల తయారీ పనులు జోరందుకున్నాయి. అయితే అనేక కారణాల వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వివిధ రకాల విగ్రహాల ధరలు 30 శాతం వరకు పెంచకతప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు.
అదనపు ఆర్థిక భారానికి కారణాలివీ..
పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (íపీఓపీ) తో తయారయ్యే విగ్రహాలకు స్వస్తి చెప్పాలని ఇదివరకే ప్రభుత్వం, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేశాయి. దీంతో వర్క్ షాపు యజమానులు బంక మట్టితో విగ్రహాలు తయారు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మట్టి ధరలు, వర్క్ షాపుల్లో పనిచేసే కార్మికులు, శిల్పకారుల వేతనాలు, విగ్రహాల తయారికి వినియోగించే ఇనుప చువ్వలు, రంగులు, షెడ్డు నిర్మాణానికి అవసరమైన వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, వివిధ రకాల రంగులు, స్ధలం అద్దె, బీఎంసీ అనుమతి చార్జీలు కూడా పెరిగాయి.
నీటి కొరతతో దెబ్బ
అదేవిధంగా ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకూ ఆశించిన స్థాయి వర్షపాతం లేదు. గత నెలలో మినహా భారీ వర్షాలు మళ్లీ కురవలేదు. వర్షాలు అనుకున్నంతమేర కురవకపోవడంతో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ నీటికోత అమలులోనే ఉంది. కొని చోట్ల రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. దీంతో గణేశ్ విగ్రహాలు తయారుచేసే అనేక వర్క్‌షాపులు, షెడ్ల యజమానులు వాటర్ ట్యాంకర్లపై ఆధార పడాల్సిన పరిస్ధితి వచ్చింది.
ఎండిపోయిన బంక మట్టిని విగ్రహాల తయారీకి అనుగుణంగా మెత్తగా పిసకాలంటే నీటి వినియోగం ఎక్కువ మోతాడులో అవరమైతుంది. దీన్ని అదనుగా చేసుకున్న వాటర్ ట్యాంకర్ యజమానులు చార్జీలు పెంచేశారు. ఇది కూడా విగ్రహాల తయారీదారులకు అదనపు ఆర్థిక భారంగా పరిణమించింది. ఇలా అనేక కారణాలతో విగ్రహాల ధరలను 20–30 శాతం వరకు పెంచాల్సిన పరిస్ధితి వచ్చిందని తయారీదారులంటున్నారు. ముఖ్యంగా గత నాలుగైదు నెలలుగా పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధం కారణంగా విదేశాల నుంచి దిగుమతి కావల్సిన కొన్ని ముడి సరుకులు సకాలంలో రవాణా కావడం లేదు.
చదవండి: ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్
ముఖ్యంగా విగ్రహాలకు అమర్చాల్సిన నకిలీ ముత్యాలు, పగడాలు, రంగురాళ్లు, కిరీటాలు, గిల్టు నగలు సమయానికి అందలేదు. సముద్ర మార్గం మీదుగా సామగ్రి రవాణాకు చాలా తక్కువగా ఖర్చవుతుంది. అదే విమానాల్లో దిగుమతి చేసుకుంటే నాలుగు రెట్లకుపైనే రవాణా చార్జీలు చెల్లించాల్సిఉంటుంది. దీంతో గత్యంతరం లేక ఎక్కువ ధర చెల్లించి విమానాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా ఖర్చులు పెరగడంతో 20–30 శాతం వరకు ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులంటున్నారు.


