ఫడ్నవీస్ ప్ర‌భుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్‌ | Why Manoj Jarange Patil threatens fresh stir details here | Sakshi
Sakshi News home page

ఉద్దేశ్యపూర్వకంగా కున్బీ ధ్రువపత్రాల రద్దు

Aug 7 2026 6:51 PM | Updated on Aug 7 2026 7:29 PM

Why Manoj Jarange Patil threatens fresh stir details here

మరాఠా సమాజానికి అన్యాయం చేసేందుకే ఈ కుట్ర

ప్రభుత్వంపై ‘మరాఠా’ నాయకుడు మనోజ్‌ జరాంగే తీవ్ర విమర్శలు 

ధ్రువపత్రాల మంజూరులో రెవెన్యూ మంత్రి ఒత్తిడి 

భారీ అవినీతికి ఆధారాలున్నాయని సంచలన వ్యాఖ్యలు

సాక్షి, ముంబై: మరాఠా రిజర్వేషన్‌కు సంబంధించిన కున్బీ కుల ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ (వాలిడిటీ) పత్రాల రద్దు అంశం మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. మరాఠా ఉద్యమ నేత మనోజ్‌ జరాంగే పాటిల్‌ (Manoj Jarange Patil) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వాటిని ఖండిస్తూ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.

మనోజ్‌ జరాంగే మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావన్‌కుళేపై తీవ్ర విమర్శలు చేశారు. కుల ధ్రువపత్రాల మంజూరులో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఒక కేసులో రూ.15 లక్షల లంచం కోరినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సంబంధిత అధికారులకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. తనను రాజకీయంగా ఒంటరి చేసి జైలుకు పంపే కుట్ర జరుగుతోందని, అవసరమైతే రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరించారు.

మరాఠా సమాజానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని, చంద్రశేఖర్‌ బావన్‌కుళే ఒత్తిడితో కున్బీ ధ్రువపత్రాలను ఉద్దేశపూర్వకంగా రద్దు చేస్తూ  వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో మహాయుతికి గట్టి ఎదురుదెబ్బ కొడతామని హెచ్చరించారు. అవసరమైతే 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను ఓడించి చూపిస్తానని సవాల్‌ విసిరారు. శిందే మరాఠా సమాజం పట్ల  ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించిన జరాంగే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన కంటే ఉద్ధవ్‌ ఠాక్రేయే మేలనుకోవాల్సి ఉంటుందని  వ్యాఖ్యానించారు.

కమిటీ నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు: సీఎం ఫడ్నవీస్‌
జరాంగే ఆరోపణలపై స్పందించిన సీఎం ఫడ్నవీస్.. కుల ధ్రువీకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ మంత్రి జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ కమిటీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. కుల ధ్రువీకరణలో అన్ని వర్గాలకు చెందిన దరఖాస్తుల్లో సాధారణంగా 10 నుంచి 25 శాతం వరకు తిరస్కరణకు గురవుతుంటాయని, బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు కూడా గతంలో ఇదే అనుభవం ఎదురైందని గుర్తుచేశారు. ధ్రుపపత్రాల తిరస్కరణపై చట్టపరంగా అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని ఫడ్నవీస్‌ తెలిపారు. అవసరమైన పత్రాలు సమర్పించి మళ్లీ పరిశీలన కోరవచ్చని పునరుద్ఘాటించారు. 

చ‌ద‌వండి: ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ వర్తించదు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement