టెహ్రాన్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎంతో కాలంగా సముద్రంలోనే ఉండి అమెరికాకు సేవలంధిస్తున్న అబ్రహం లింకన్ యుద్ధ నౌక స్థానంలో యుఎస్ మరో వార్‌షిప్‌ను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరొక శక్తివంతమైన నౌక యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ను మధ్యప్రాచ్యానికి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని, లింకన్ నౌక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు దీనికి సంబంధం లేదని అధికారులు తెలిపారు.
ఎంతోకాలంగా అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌకలో సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి పసిఫిక్ ప్రాంతం కోసం బయలుదేరిన ఈ నౌక, ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం కావడంతో మధ్యప్రాచ్యానికి దారి మళ్లించబడింది. ఎలాంటి పోర్ట్ కాల్ (ఓడరేవు సందర్శన) లేకుండానే ఈ నౌక ఏకంగా 200 రోజులకు పైగా సముద్రంలోనే గడపడం సిబ్బందికి అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారింది. గత 250 రోజులకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంతో నావికుల్లో తీవ్రమైన అలసట, మానసిక క్షోభ నెలకొన్నాయి.
సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్య ఆలోచనలు మరియు కొందరు సిబ్బంది ఓడ నుంచి దూకే ప్రయత్నాలు చేశారన్న వార్తలు కుటుంబ సభ్యులు, చట్టసభ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించాయి. మరోవైపు, ఆహార కొరత, నీటి కాలుష్యం, మరుగుదొడ్ల సమస్యలు, బూజు పట్టడం, మెయిల్ వ్యవస్థ దెబ్బతినడం వంటి దుర్భర పరిస్థితులను కుటుంబ సభ్యులు ఎత్తిచూపారు. శాన్ డియాగోలో జరిగిన సమావేశంలో బాధ్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలను అమెరికా నావికాదళం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సేత్ తోసిపుచ్చారు. ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సిబ్బందికి కౌన్సెలర్లు, శుద్ధి చేసిన నీరు, భోజనం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఆహారం, పరిశుభ్రతా వస్తువుల అందజేతలో కొన్ని అంతరాయాలు ఏర్పడినట్లు నావీ అంగీకరించింది.
ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, నావికులు మానసికంగా మరింత కుంగిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్‌కు విధుల నుంచి విరామం ఇవ్వడానికి జార్జ్ వాషింగ్టన్‌ను పంపుతున్నట్లు తెలుస్తోంది. జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం వియత్నాంలోని డానాంగ్ నుంచి బయలుదేరిన ఈ నౌక సింగపూర్ జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్లు యూఎస్ నావీ అధికారులు తెలిపారు.


