కర్ణాటకలో కొత్త బిల్లు.. ఆరెస్సెస్‌కు చెక్‌ పెట్టేందుకేనా? | Karnataka Cabinet Approves Public Property Bill | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో కొత్త బిల్లు.. ఆరెస్సెస్‌కు చెక్‌ పెట్టేందుకేనా?

Aug 14 2026 10:49 AM | Updated on Aug 14 2026 10:58 AM

Karnataka Cabinet Approves Public Property Bill

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్‌-ఆరెస్సెస్‌ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ భవనాలు, భూములు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు తదితర ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వినియోగించుకునే విధానాన్ని నియంత్రించేందుకు సిద్ధమైన కొత్త బిల్లుకు కర్ణాటక కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం ఆరెస్సెస్‌ను కట్టడి చేయడమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

‘కర్ణాటక రెగ్యులేషన్‌ ఆఫ్‌ యూజ్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ప్రెమైసెస్‌ అండ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ బిల్‌–2026’ పేరుతో తీసుకొస్తున్న ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆస్తుల వినియోగానికి స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాల కోసం ప్రభుత్వ స్థలాలను ఉపయోగించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసినా, వాటికి నష్టం కలిగించినా చర్యలు, జరిమానాలకు అవకాశం ఉండనుంది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే మాత్రం ఈ బిల్లు ఏ ఒక్క సంస్థను లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులను రక్షించడం, వాటి వినియోగంలో జవాబుదారీతనం తీసుకురావడమే ఉద్దేశమని చెప్పారు. ప్రత్యేకంగా ఆరెస్సెస్‌, ఏదైనా సంస్థ, క్లబ్‌, యూనియన్‌ లేదా ఎన్జీవోను అడ్డుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు.

అయితే, కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరెస్సెస్‌ ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2025లో ప్రభుత్వం ఇలాంటి వినియోగంపై నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, ఆ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టులో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు అదే అంశానికి చట్టబద్ధమైన రూపం ఇవ్వడానికి కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 2026 జూన్‌లో ప్రియాంక్‌ ఖర్గే ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కు బహిరంగ లేఖ రాయడం కూడా ఈ పరిణామానికి రాజకీయ నేపథ్యాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆరెస్సెస్‌ చట్టపరమైన నమోదు, ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాల్లో పారదర్శకత, పన్నుల నిబంధనలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తాజాగా కేబినెట్‌ ఆమోదించిన బిల్లుపై సహజంగానే ఆరెస్సెస్‌ పేరు చర్చకు వచ్చింది. కొన్ని రాజకీయ వర్గాలు ఇది ఆరెస్సెస్‌ కార్యకలాపాలపై నియంత్రణ పెంచే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం “నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి” అని చెబుతోంది.

ఈ బిల్లు కేవలం ఆరెస్సెస్‌ కార్యక్రమాలకే పరిమితం కాదు. ప్రభుత్వ భూములు, భవనాలు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు వంటి ప్రజా ఆస్తులను ఉపయోగించే ప్రైవేటు సంస్థలు, సంఘాలు, అసోసియేషన్లు, సొసైటీలు అన్నింటికీ ఒకే విధమైన అనుమతి వ్యవస్థను తీసుకురావడం ప్రతిపాదనలో ఉంది. అనుమతి లేకుండా వినియోగించడం లేదా ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అంశాలపై కూడా చర్యలు ఉండనున్నాయి. అయితే అసలు రాజకీయ పరీక్ష ఇక ముందే ఉంది. కేబినెట్‌ ఆమోదించిన బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సి ఉంది. అక్కడ ప్రతిపక్షం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? ప్రభుత్వం నిబంధనలను ఎలా అమలు చేస్తుంది? ఆరెస్సెస్‌ సహా ఇతర సంస్థలు దీనిపై న్యాయపరంగా స్పందిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement