సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పరిపాలనా చరిత్రలో ఇది చీకటి రోజని, కళ్యాణ లక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఒకే రోజు 8 జీవోల అమలును నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. అడ్వకేట్ విజయ్ గోపాల్ వేసిన పిల్ విచారణ సందర్భంగా, గత నెల రోజులుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ దాఖలు కాకపోవడం వల్లే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
జులై 8 నుంచి ఆగస్టు 7 వరకు ఐదు సార్లు సమయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేసిందని ఆయన ఆరోపించారు. గత 9 నెలలుగా వెరిఫికేషన్ పేరుతో ఈ పథకానికి నిధులు ఆపేశారని, కేసీఆర్ హయాంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, పేదల కష్టాలు తీర్చడానికి తెచ్చిన ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 13 లక్షల మంది లబ్ది పొందారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మాదిరిగానే ఈ పథకాన్ని కూడా నాశనం చేసి, ఇక్కడి నిధులను మెఘా, పొంగులేటి, రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలకు మళ్లించే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, ఆ నోట్ ఫైల్ పట్టుకొని గన్ పార్క్ వద్దకు చర్చకు రావాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి, అజారుద్దీన్‌లకు సవాల్ విసిరారు.
ప్రభుత్వానికి చేతకాకపోతే తమ బీఆర్ఎస్ లీగల్ సెల్‌ను సంప్రదించాలని, ఆర్టికల్ 15(3), ఆర్టికల్ 21 ప్రకారం ఈ పథకం చట్టపరమైనదేనని తామే కౌంటర్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని ప్రజలు అడుగుతారనే భయంతోనే ప్రభుత్వం ఈ పథకానికి మంగళం పాడుతోందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.


