సాక్షి, హైదరాబాద్: ‘‘కరవు రావాలని కొందరు క్షుద్ర పూజలు చేశారు. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. ఇలాంటి పూజలు చేస్తే మీకే తిరగబడుతుంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ప్రతీక దృష్టితో అభివృద్ధి చేయాలని శ్రీధర్ బాబుని ఆదేశిస్తున్నానన్నారు.
‘‘గత పదేళ్ల పాలన, ఈ రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణలో రూ.3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆడ బిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. కడుపులో విషం పెట్టుకుని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా వెనక్కి తగ్గలేదు
..ఆడ బిడ్డలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లను ఇచ్చాం. ఒక వైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?. పట్టణంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శ్రీకారం చుట్టింది
..మొదటి విడతలో లక్ష ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. 22 ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది. ఈ విషయంలో మీకు ఆందోళన అవసరం లేదు. సోషల్ మీడియాలో కొందరు చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. పదేళ్ల వారి పాలను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


