సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓటర్లకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎన్నికల సంఘం (ECI) పేరుతో వస్తున్న నకిలీ మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని మెసేజ్‌లలో ఫారమ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.5 చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను నమోదు చేయాలని కోరుతున్నారని వెల్లడించారు. ఈ మోసాలపై పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.
సీఈవో సుదర్శన్ రెడ్డి తాజాగా.. ఓటర్ల వివరాలు, ఎన్యూమరేషన్ ఫారమ్‌లో సమాచారం సరిపోలడం లేదంటూ సైబర్ మోసగాళ్లు ఓటర్లకు మెసేజ్‌లు పంపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. తమ ఫారమ్ రిజెక్ట్ అయిందని, దాన్ని పూర్తి చేయాలంటే ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలని చెబుతున్నట్లు తెలిపారు. కొన్ని మెసేజ్‌లలో ఫారమ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.5 చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను నమోదు చేయాలని కోరుతున్నారని వెల్లడించారు.
ఇక్కడితో ఆగకుండా లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్, CVV, ATM PIN వంటి అత్యంత కీలకమైన బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా సైబర్ నేరగాళ్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని సూచించారు. ఇలాంటి మెసేజ్‌లు, కాల్స్‌ను ECI లేదా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ పంపడం లేదని స్పష్టం చేశారు. ఓటర్లను తప్పుదోవ పట్టించి వారి బ్యాంకింగ్ వివరాలను దొంగిలించేందుకు సైబర్ మోసగాళ్లు ఎన్నికల సంఘం పేరును దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.
అందువల్ల ఓటర్లు గుర్తుతెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, ఎలాంటి బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించారు. అనుమానాస్పద మెసేజ్‌లు లేదా కాల్స్ వస్తే వాటికి స్పందించకుండా వెంటనే అప్రమత్తం కావాలని కోరారు. ఇలాంటి మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం పేరుతో మెసేజ్ వచ్చిందని నమ్మి లింక్ ఓపెన్ చేస్తే.. ఓటు వివరాల సంగతి పక్కన పెడితే బ్యాంక్ ఖాతానే ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఓటర్లూ.. జాగ్రత్త! అని హెచ్చరించారు.


