హైదరాబాద్: ఐటీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పరిచయమైన వ్యక్తి తనను గదికి పిలిచి లైంగికంగా వేధించడంతో పాటు తనతో ఉన్న చాటింగ్, ఫొటోలను తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన యువతి (20) కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్ ఉంటూ చదువుకుంటోంది. గతంలో చెన్నైలో నాన్–ఐటీ ఉద్యోగం చేస్తుండగా ఆమె అత్త.. తనకు పరిచయమైన మండాది వెంకట సాంబశివరెడ్డికి ఐటీ రంగంలో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పింది.
దీంతో ఆమె అతడిని సంప్రదించగా నగరానికి వస్తే ఐటీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి గత నెల 12న నగరానికి వచ్చి హాస్టల్‌లో ఉంటుంది. అదే నెల 16న ఇంటర్వ్యూ ఉందంటూ సాంబశివరెడ్డి ఆమెను తన గదికి పిలిచాడు. అక్కడ కొందరితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఆమెను పంపించాడు. 22వ తేదీన మళ్లీ ఇంటర్వ్యూ ఉందంటూ పిలిచి, ఇంటర్వ్యూ అనంతరం బంజారాహిల్స్‌లోని తన గదికి రావాలని కోరాడు. అయితే తాను రావడానికి నిరాకరించగా, గతంలో తనతో జరిగిన ఫోన్ సంభాషణలు, చాటింగ్‌ల స్క్రీన్‌షాట్లు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు.
దీంతో భయపడి అతని గదికి వెళ్లింది. గదిలో ఆమె అనుమతి లేకుండా చేయి పట్టుకుని అసభ్యంగా ప్రయత్నించగా, వెంటనే అతడిని పక్కకు నెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అనంతరం ఇంటర్నెట్ నుంచి ఆమె నగ్న ఫొటోలు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె నిరాకరిస్తున్నా పట్టించుకోకుండా శారీరక సంబంధం కోసం నిరంతరం ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


