సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుని జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను (ఎఫ్‌ఆర్‌సీ) ఓటర్ నమోదు సవరణల్లో ఆమోదించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ లిఖితపూర్వక లేఖ రాసింది.
మీసేవా కేంద్రాల ద్వారా ఎఫ్‌ఆర్‌సీలు జారీ చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం జులై 25న జీవో 172ను విడుదల చేసింది. అయితే, కేవలం రేషన్ కార్డుల ఆధారంగా ఎఫ్‌ఆర్‌సీలను జారీ చేయడంపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందాయి. రేషన్ కార్డు ప్రామాణికంగా ఎఫ్‌ఆర్‌సీలను జారీ చేస్తే అనర్హులు కూడా ఓటర్ల జాబితాలోకి చేరే ప్రమాదం ఉందని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుల ప్రస్తావన
ఈ వ్యవహారాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేషన్ కార్డు అనేది ఓటరు అర్హత నిర్ధారణకు లేదా ఎస్ఐఆర్‌కు అనువైన డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఈసీ ప్రస్తావించింది. 2013 నాటి మెమో 11496 ప్రకారం ఫ్యామిలీ సర్టిఫికెట్లకు అనుమతి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదించినప్పటికీ, ఈసీ దానిని తోసిపుచ్చింది. రేషన్ కార్డుల ఆధారంగా రూపొందించిన ఎస్ఆర్సీ పత్రాలను ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.


