సర్ ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ స్వీకరించబోమని ఈసీ స్పష్టీకరణ
విచారణ లేకుండా జారీ చేసే ఈ సర్టిఫికెట్ ప్రామాణికం కాదు
గత జూలై 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను స్వీకరిస్తాం
సీఈఓకు ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జూలై 25న జీవో 172 కింద జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా ప్రామాణిక పత్రంగా అంగీకరించలేమని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కు లేఖ రాశారు. 2026 జూలై 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను మాత్రం ఆధారంగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ‘సర్’ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
చివరి సారిగా 2002లో సర్ నిర్వహించినప్పుడు రూపొందించిన ఓటర్ల జాబితాతో పోల్చితే ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లు, ఇతర వివరాల్లో తేడాలు కలిగిన ఓటర్లకు స్థానిక ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వోలు) ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 మధ్య నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారు. సర్ ప్రక్రియలో 2,64,87,214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించగా, వారిలో 60,51,503 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు నిర్ధారించడంతో వీరందరూ త్వరలో నోటీసులు అందుకోనున్నారు.
విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక దాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉండగా, ఆ జాబితాలో పదో పత్రంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన వారికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీకి ఆదేశిస్తూ జూలై 25న ప్రభుత్వం జీవో 172 జారీ చేయగా, ‘సర్’ప్రక్రియలో అది చెల్లుబాటు కాదని తాజాగా ఈసీ స్పష్టం చేసింది.
విచారణ లేకుండా జారీ చేయనుండటంతోనే...
రేషన్ కార్డ్ డేటా ఆధారంగా ఎలాంటి విచారణ లేకుండా మీ–సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశిస్తూ జీవో 172ను జారీ చేశారని ఈసీ ప్రస్తావించింది. విచారణ లేకుండా జారీ చేసే ఈ సర్టిఫికెట్ కేవలం రేషన్ కార్డుతో సమానమని పేర్కొంది. ‘సర్’ధ్రువీకరణ పత్రాల జాబితాలో రేషన్‌కార్డును చేర్చలేదని గుర్తు చేసింది. రేషన్ కార్డు పౌరసత్వానికి తగిన నిదర్శనం కాదని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. గత జూలై 25న జీవో 172 జారీ చేయగా,ఆ తేదీకి ముందు పాత విధానంలో జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను మాత్రం రుజువుగా స్వీకరిస్తామని ఈసీ స్పష్టంచేసింది.


