కీలక దశల్లో తగినంత తేమనందించే సమతుల్య వర్షపాతమే దిగుబడికి ముఖ్యం
భారీ వర్షాల కంటే సమానంగా విస్తరించిన వర్షపాతమే విలువైనది
శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తేనష్టాన్ని 50% అరికట్ట వచ్చంటున్ననిపుణులు
సాక్షి, స్పెషల్ డెస్క్ : ఒకసారి భారీగా వర్షం పడటం కంటే.. సమతుల్య వర్షపాతంతోనే సాగుకు మేలు అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పంటకు అవసరమైన దశలో వర్షం పడినా, తక్కువ వర్షపాతం ఉన్నా, ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చాలా ఎక్కువ వర్షపాతం అవసరం లేనప్పుడు పడితే మాత్రం, పంట నష్టపోవటమే కాకుండా దిగుబడిలో కూడా చాలా తేడా వస్తుందంటున్నారు. ప్రస్తుతం సాధారణంగా ఒక నెల రోజుల్లో పడే వర్షం అంతా.. మూడు, నాలుగు రోజులు లేదా ఒక 10 రోజుల్లో పడటం.. లేదంటే ఒక్కోసారి ఒకే రోజులోనూ పడుతోంది, దీనివల్ల పంటలకు నిస్సందేహంగా నష్టం ఉంటుంది.
రాష్ట్రంలో ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తొలి రెండు నెలలు అసమాన సాధారణ వర్షపాతం నమోదైంది. ఇటీవలి భారీ వర్షాలతో ఆ అసమానత తగ్గింది. ముందు వర్షాలు లేనందువల్ల ఇప్పుడు పడిన అధిక వర్షాలు రైతులకు నిస్సందేహంగా ఉపయోగపడతాయి. ఇప్పటికే వేసిన పంటల పెరుగుదల తిరిగి పుంజుకుంటుంది. ఇప్పటికైతే వర్షపాతం లోటు చాలా వరకు తగ్గిపోయింది. ఇక ముందు పంటలకు అవసరానికి అనుగుణంగా సమతుల్యంగా వర్షం పడితే పర్వాలేదు. అలా కాకుండా వర్షాలు విపరీతంగా ఎక్కువైపోతే.. ఆ అదనపు నీటిని పొలాల్లో నుంచి ఎప్పటికప్పుడు బయటకు పంపాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఏ కారణం వల్ల రైతులు ఆ పని చెయ్యలేకపోతే ఏ పంటైనా, అది ఏ దశలో ఉన్నా, కలుపు, వేరుకుళ్లు, తెగుళ్లు, పురుగు వంటి సమస్యలు రైతును చుట్టుముట్టి దిగుబడి నష్టపరచడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.
వర్షం ఎక్కువైనా,తక్కువైనా పంటలను కాపాడుకోవటం ఎలా?
వర్షాలు కురవని సమయంలో బెట్టను తట్టుకోవటానికి, ఒకేసారి వర్షం ఎక్కువై నీరు నిలిచినప్పుడు పంటలను రక్షించుకోవటానికి రైతులు తేమ సంరక్షణ పద్ధతులుపాటించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ వాతావరణ పరిశోధన విభాగం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ) డా. లీలారాణి రైతులకు ఆచరణాత్మక సూచనలు చేశారు.
సాలుకు అడ్డంగా దుక్కి: విత్తనం వేయక ముందే కొండ వాలుకు లేదా నేల వాలుకు అడ్డంగా దుక్కి దున్నుకోవటం వల్ల వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా నేలలో ఇంకుతుంది.
బోదెలు–కాలువల పద్ధతి: పంటలను బోదెలపై విత్తుకోవటం వల్ల అధిక వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా వరద నీటిని సులభంగా బయటకు పంపొచ్చు. వర్షాలు లేని సమయంలో ఈ కాలువలే తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతాయి.
ఎత్తు మడుల సాగు: నీటి ముంపు త్వరితగతిన నివారించటానికి ఎత్తు మడుల పద్ధతి విశేషంగా తోడ్పడుతుంది.
నాగలితో గొడ్డు చాలు: వర్షాధార పంటల్లో ఆఖరి గుంటక తోలిన తర్వాత ఒక గొడ్డు చాలు (గబ్బచాలు) వేసుకోవాలి. ఇది నీరు బయటకు పోవటానికి, బెట్ట సమయంలో తేమను కాపాడటానికి ఉపయోగపడుతుంది.
చేను గట్లు, డ్రైనేజీ కాలువల నిర్వహణ: పొలం చుట్టూఉన్న గట్లు, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని, నీరు వెంటనే బయటకు వెళ్లేలా ‘డ్రైనేజీ’వసతి సరిగ్గా ఉంచుకోవాలి.
పంట కుంటల నిర్మాణం: తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో పొలం దిగువ ప్రాంతంలో పంట కుంటలు (ఫామ్ పాండ్స్) తవ్వుకోవాలి. భారీ వర్షాల నీటిని ఇందులో మళ్లించి, ఆ తర్వాత బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రక్షక తడిగా వాడుకోవచ్చు. భారీవర్షాలు కురిసిన తర్వాత వరద నీటిని రైతులు వీలైనంత త్వరగా బయటకు తీసివేయాలి. అదను చూసుకొని వెంటనే అంతర కృషి చేయాలి. ఎకరానికి 20 కేజీలు యూరియా, 10 కేజీల పొటాష్ ను పైపాటుగా వెయ్యాలి. అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
తెలంగాణలో ఇలాంటి పరిస్థితే ఉంది..
సమానంగా విస్తరించిన వర్షపాతంతో వ్యవసాయం బాగుంటుంది. పంటకు అవసరమైన కీలక దశల్లో తగినంత నీరు లభించడమే మంచి దిగుబడి పొందటానికి ముఖ్యం. చాలా రోజులు వర్షం లేకుండా ఒకేసారి కుంభవృష్టి కురిస్తే వర్షపాతం లోటు తగ్గినా, పంటలకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితే నెలకొంది. మొదట్లో తీవ్ర కొరత వచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల అతివృష్టి సమస్య.
ఇక ముందూ వర్షాలు ఎక్కువైతే సమస్యలే. వర్షాధారంగా ఎక్కువగా సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు, పెసర, మినుము వంటి పంటలకు ఈ అసమాన వర్షపాతం వల్ల వివిధ దశల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం మేం వెలువరించే వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను గమనిస్తూ రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాటిస్తే పంట నష్టాన్ని కనీసం 50 శాతం వరకు అరికట్టవచ్చు.
– డాక్టర్ పి. లీలారాణి


