పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి శేషాద్రి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు
ధాన్యం డబ్బు బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఉద్దేశపూర్వకంగా ఎగవేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు
బకాయిల వసూలుకు విధివిధానాలు రూపొందించాలి
మొండి బకాయిదారులకు భవిష్యత్తులో ధాన్యం కేటాయించొద్దు
ఆ ధాన్యాన్ని మహిళా సంఘాలకు అప్పగించే అంశం పరిశీలించాలి
ధాన్యం నిల్వకు పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో సైలో బ్యాగులు
ప్రైవేటు గోదాములు, కల్యాణ మండపాలు, పాత థియేటర్లను కూడా గుర్తించండి
పౌరసరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వ్యాపార దృక్పథంతో ధాన్యం మిల్లులు నిర్వహించే వారితో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ ఉద్దేశపూర్వకంగా బకాయిలు ఎగవేసేందుకు ప్రయత్నించే వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం సొమ్ముకు సంబంధించిన బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం స్పష్ట మైన విధివిధానాలను రూపొందించాలని సూచించారు. బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభు త్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం కల్పించిందని, ఇప్పుడు ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల (మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం మాయం కావడానికి సంబంధించిన బకాయిలు) వసూళ్లలో కొంత పురోగతి సాధించామని, మిగిలిన మొత్తాన్ని కూడా పూర్తిగా రాబట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు విధివిధానాలను రూపొందించిన తర్వాత నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సూచించారు. ఉప సంఘం పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు ఇకపై ధాన్యం కేటాయించకుండా, ఆ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ బాధ్యతను అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.
సైలో బ్యాగుల కోసం భూకేటాయింపు
ప్రతి సీజన్‌లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. భారీగా ధాన్యం వచ్చే నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ (భారీ ప్లాస్టిక్ ట్యూబ్‌లు)ల ఏర్పాటును పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. సైలో బ్యాగ్ నిర్మాణాలపై రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు. వీబీజీ రామ్‌జీలో ప్లాట్‌ఫాంల నిర్మాణానికి అవకాశం ఉన్నందున విశాలమైన ఫ్లాట్‌ఫాంలు నిర్మించి, జర్మన్ టెంట్లలో ధాన్యం నిల్వ చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.
ప్రైవేటు గోదాముల గుర్తింపు
ధాన్యం నిల్వకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా సీఎం ఆరా తీశారు. మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు. ధాన్యం నిల్వకు అనువైన కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను గుర్తించి అవసరమైనప్పుడు లీజుకు తీసుకునేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి సీజన్‌లో చివరి నిమిషంలో గోదాముల కోసం పరుగులు పెట్టకుండా ముందుగానే నిల్వ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, దక్షిణ భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


