సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి | CM younger brother company gets Rs 200 crore land | Sakshi
Sakshi News home page

సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి

Aug 12 2026 4:47 AM | Updated on Aug 12 2026 4:47 AM

CM younger brother company gets Rs 200 crore land

ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీకి రూ.7 కోట్లకే ఐదు ఎకరాలు కేటాయింపు

టెస్సరాక్ట్‌ చైర్మన్‌గా సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి పేరు లింక్డ్‌ ఇన్‌లో 

మూలధనం రూ.లక్ష.. ఫోన్‌ నంబరు 123456789గా పేర్కొన్నారు

టెస్సరాక్ట్‌తో సీఎం సోదరుడికి సంబంధం లేదని మంత్రి చెప్పడం విడ్డూరం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఒక్క ఉద్యోగి కూడా లేని, కేవలం రూ.లక్ష పెయిడ్‌ అప్‌ మూలధనం ఉన్న కంపెనీకి ఇంత విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలోని అతి­పెద్ద భూకేటాయింపు అక్రమాల్లో ఒకటిగా అనుమానిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే లోకాయుక్త, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఒక్క ఉద్యోగి లేని సంస్థకు ఐదెకరాలా?
‘టెస్సరాక్ట్‌ చైర్మన్‌ తానేనంటూ సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తమ సంస్థ పనిచేస్తున్నట్టు పేర్కొంటూ కొండల్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కూడా పాల్గొన్నారు. టెస్సరాక్ట్‌ చైర్మన్‌ హోదాలోనే యూఎస్‌ భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో కొండల్‌రెడ్డి చేరినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టెస్సరాక్ట్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో ఫోన్‌ నంబర్‌ 123456789గా పేర్కొంటూ, 2025 మార్చి 31 నాటికి ఉద్యోగుల సంఖ్య సున్నాగా పేర్కొ­న్నారు. పటాన్‌చెరులోని ఓ చిన్న ఫ్లాట్‌ను టెస్స­రాక్ట్‌ చిరునామాగా చూపుతున్నారు. 

గజానికి సుమారు రూ.3,700 చొప్పున ఐదు ఎకరాల భూమిని ఫ్యూచర్‌ సిటీలో రూ.7 కోట్లకు కేటాయించింది. రూ.200 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కేటాయించడం కుంభకోణం కాదా. టెస్సరాక్ట్‌కు, కొండల్‌రెడ్డికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం విడ్డూరం. అమెరికాలో ఉన్న సీఎం మరో సోదరుడు జగదీశ్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ్‌ బయో సంస్థతో సుమారు రూ.1,000 కోట్ల ఎంఓయూను అమెరికా పర్యటన సందర్భంగా రేవంత్‌ కుదుర్చుకున్నాడు. మంత్రి శ్రీధర్‌బాబు శాఖలోనే ఈ నిర్ణయాలు జరిగితే ఆయనకు సమాచారం లేదా. టెస్సరాక్ట్‌కు భూ కేటాయింపు వ్యవహారంపై చివరి వరకు పోరాడతాం’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే జల ఉద్యమం
‘కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. ఇదే విషయాన్ని ఈ నెల 18న జరిగే గోదావరినది యాజ­మాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఎజెండాలో చేర్చ­డం సరికాదు. ఎజెండాలో ఈ అంశాలను తొలగించకుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించాలి. లేదంటే జల ఉద్యమం చేపట్టి, అవసరమైతే జీఆర్‌ఎంబీ సమావేశం జరిగే జలసౌధను ముట్టడిస్తాం. సీఎం యాగాలు చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ నీటిని ఒడిసి పట్టే పనులు చేయకుండా యాగాలు చేయడాన్నే మేము ప్రశ్నిస్తున్నాం’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement