పాతబస్తీ ‘మెట్రో’ వేగం పెంచండి | Revanth Reddy orders officials to speed up Old Town Metro work | Sakshi
Sakshi News home page

పాతబస్తీ ‘మెట్రో’ వేగం పెంచండి

Aug 12 2026 4:36 AM | Updated on Aug 12 2026 4:36 AM

Revanth Reddy orders officials to speed up Old Town Metro work

మెట్రో టెండర్‌ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పూర్తి చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల­ను ఆదేశించారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయ­ణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టనున్న మెట్రో కారిడార్‌కు సంబంధించి రహదారి విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మార్గంలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించి అవసరమైన సలహా­లు తీసుకోవాలని సూచించారు. 

హైదరాబాద్‌ మెట్రోలో రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రైళ్లకు అదనపు బోగీలను జత చేసేందుకు అవస­రమైన కోచ్‌ల కొనుగోలుపై చర్యలు చేపట్టా­లని ఆదేశించారు. ప్రయాణికులకు మెరుౖ­గెన సేవలు అందించేలా ముందస్తు ప్రణాళిక­తో వ్యవహరించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా
ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై సీఎం రేవంత్‌ సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సదస్సును నిర్వహించి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ వ్యాపార రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులను సదస్సులో సన్మానించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. 

గత ఏడాది సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై పూర్తి వివరా­లతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణా­ళిక రూపొందించాలని సూచించారు. సమావే­శంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారా­వు, ఎన్‌వీఎస్‌ రెడ్డి, మెట్రో రైల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్, అదనపు ఎండీ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement