మారనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానం
వచ్చే ఏడాది నుంచి పైలెట్ ప్రాజెక్టు
అడాప్టివ్ పరీక్ష పద్ధతిలో నిర్వహణ
ఏఐ ఆల్గరిథమ్ ఆధారంగా ప్రశ్నలు
కేంద్రానికి ఐఐటీ కౌన్సిల్ ప్రతిపాదనలు
జేఈఈ, నీట్ పరీక్షలకు కూడా ఇదే విధానం
కోచింగ్ కేంద్రాల కట్టడికి సరికొత్త వ్యూహం!
ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు రాసే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానం పూర్తిగా మారబోతోంది. అడాప్టివ్ పరీక్ష పద్ధతిలో దీన్ని నిర్వహించబోతున్నారు. ఒక రకంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధాన పరీక్ష విధానం. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ప్రశ్నల పరంపర ఉండటం దీని ప్రత్యేకత. ప్రతి విద్యార్థి ప్రశ్నల విధానంలో మార్పు ఉంటుంది. ఏఐ ఆల్గరిథమ్ ఆధారంగానే ఈ ప్రశ్నలు వస్తుంటాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కౌన్సిల్ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ఇటీవల కీలక సమావేశం కూడా జరిగింది.
2027లో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను కొన్ని కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అడాప్టివ్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో ఎదురయ్యే సవాళ్ళను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని కౌన్సిల్ సూచించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ విజయవంతమైతే, వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిధిలో జరిగే ఇతర పరీక్షలను కూడా ఇదే పద్ధతిలో నిర్వహించాలని భావిస్తున్నారు.
అడాప్టివ్ ప్రత్యేకత ఏమిటి?
అడాప్టివ్ పరీక్ష కంప్యూటర్ ఆధారంగానే జరుగుతుంది. అయితే ప్రతి విద్యార్థికి ఒకే ప్రశ్నపత్రం కాకుండా, ఆ విద్యార్థి సామర్ధ్యం, సమాధానాల ఆధారంగా ప్రశ్నల స్థాయి మారుతుంది. ఉదాహరణకు మొదటి ప్రశ్నను కఠినంగా ఇస్తారు. దీనికి విద్యార్థి సరైన సమాధానం ఇస్తే తర్వాత ప్రశ్న ఇంకాస్తా కఠినంగా ఉంటుంది. సమాధానం సరైనది ఇవ్వకపోతే తర్వాత ప్రశ్నలో కఠినత కాస్త తగ్గుతుంది.
ఇలా ఆఖరి ప్రశ్న వరకూ విద్యార్థి సామర్థ్యం ఆధారంగానే ప్రశ్నావళి ఉంటుంది. వీటిని సైకోమెట్రిక్స్, ఐటెమ్ రెస్పాన్స్ థియరీ ఆధారంగా రూపొందిస్తారు. దీనివల్ల విద్యార్థుల సామర్థ్యం ఎంత బాగా పనిచేస్తుందనేది తెలుస్తుంది. బట్టీపట్టే విధానానికి స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. విద్యార్థి స్థాయికి అనుగుణంగానే పరీక్ష ఉంటుంది. అవసరం లేని అనేక సులభమైన, కఠినమైన ప్రశ్నలను తగ్గించే అవకాశం ఉంటుందని ఐఐటీ కౌన్సిల్ చెబుతోంది.
వేలు కాదు.. లక్షల్లో ప్రశ్నలు!
అడ్వాన్స్‌డ్ పరీక్షకు కొన్ని వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ రూపొందిస్తారు. వీటిల్లోంచి సాధారణ, మధ్యస్థ, కఠిన విధానంలో తుది పేపర్‌ను తయారు చేస్తారు. ఏఐ ఆల్గరిథమ్‌తో ముందుకెళ్ళే ఈ అడాప్టివ్ విధానం కోసం లక్షల్లో ప్రశ్నలను క్వశ్చన్ బ్యాంకుకు అందించాలి. దీనిపై ఐఐటీ కౌన్సిల్‌లోని ప్రొఫెసర్ల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రశ్నలు మూడేళ్ళల్లో ఎప్పుడూ వచ్చినవి ఉండకూడదు. లక్షల్లో ప్రశ్నావళి ఉన్నప్పుడు దీన్ని అనుసరించడం కష్టమని కొంతమంది అభిప్రాయపడ్డారు.
సైకోమెట్రిక్స్, ఆల్గరిథమ్పై మరింత లోతుగా అధ్యయనం జరగాలని సూచించారు. దీనికి ఉండే సైబర్ సెక్యూరిటీ థియరీని నైపుణ్యం ఉన్న సంస్థలు మాత్రమే గుర్తించగలవనే అభిప్రాయానికొచ్చారు. ఈ కోణంలో విశ్వసనీయత ఉన్న సంస్థల తోడ్పాటు తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ప్రతిభ ఉన్న విద్యార్థులకు మరింత కష్టంగా ప్రశ్నలు వస్తాయని, ప్రతిభ లేని వారికి తేలికైన ప్రశ్నలు వస్తాయని, దీనివల్ల సమతూకం దెబ్బతింటుందనే కొత్త వాదనలూ తెరమీదకొస్తున్నాయి.
కోచింగ్ కేంద్రాల కట్టడికేనా?
దేశవ్యాప్తంగా 7 కోట్లకుపైగా విద్యార్థులు ఏదో రకంగా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇందులో ఒకటవ తరగతి నుంచి పోస్టు–గ్రాడ్యుయేషన్, నీట్, జేఈఈ వంటి ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు కోచింగ్ తీసుకునే వాళ్ళున్నారు. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో, మరికొన్ని ఆఫ్‌లైన్‌లో కోచింగ్ ఇస్తున్నాయి. వీటి వ్యాపారం రూ.62 వేల కోట్ల వరకూ ఉంటుందని కేంద్రం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. మరో రెండేళ్ళల్లో ఈ వ్యాపార సామ్రాజ్యం రెండింతలు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా పలు రాష్ట్రాల బోర్డు పరీక్షలకు, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలే కీలకం. వీటితో పాటు వృత్తిపరమైన సీఏ, సీఎస్, క్యాట్, గేట్‌కూ కోచింగ్ షారా మామూలే. యూపీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కోచింగ్ కేంద్రాలే శరణ్యం. కోచింగ్ కేంద్రాలు తమ వ్యాపారం కోసం పేపర్ లీక్ వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాయనే విమర్శలున్నాయి. వీటిని కట్టడి చేయడానికి అడాప్టివ్ పరీక్ష విధానం తోడ్పడుతుందని కౌన్సిల్ భావిస్తోంది.
– సాక్షి, హైదరాబాద్


