భూ క్రమబద్ధీకరణపై స్పందనేది? | Telangana High Court on Keshav Rao son and daughter land dispute | Sakshi
Sakshi News home page

భూ క్రమబద్ధీకరణపై స్పందనేది?

Aug 12 2026 4:22 AM | Updated on Aug 12 2026 4:22 AM

Telangana High Court on Keshav Rao son and daughter land dispute

కేకే కుమారుడు, కుమార్తె భూ వివాదంపై హైకోర్టు

3 వారాలు గడువు.. ఇదే చివరి అవకాశమని సర్కార్‌కు స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె గద్వాల్‌ విజయలక్ష్మికి బంజారాహిల్స్‌లోని విలువైన భూముల క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి గత డిసెంబర్‌ 10న తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం 9 నెలలుగా సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. మూడు వారాల్లో  పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంటూ, వివాదాస్పద భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియ జేయాలని చెబుతూ విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసింది. 

అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా బంజారాహిల్స్‌లోని అత్యంత విలువైన 1,161 గజాలను వెంకటేశ్వర్‌రావుకు, 425 గజాలను గద్వాల్‌ విజయలక్ష్మికి క్రమబద్ధీకరించిందంటూ జి.రఘువీర్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అక్కడ గజానికి రూ.60,300 ఉండగా, వెంకటేశ్వరరావుకు రూ.2,500, విజయలక్ష్మికి రూ.350 చొప్పున క్రమబద్దీకరించారన్నారు.

ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఈ భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, రూ.9 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. పిల్‌ను ఉపసంహరించుకోవడానికి కె. వెంకటేశ్వరరావును పిటిషనర్‌ డబ్బులు డిమాండ్‌ చేశారని, దీనిపై పిటిషనర్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. చిన్న విస్తీర్ణంలోని ప్రభుత్వ భూములను వివిధ జీవోల ద్వారా క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఒకవేళ ఉంటే, కేకే కుటుంబ సభ్యులకు కేటాయించిన భూములకు సంబంధించిన జీవోలను సవరించి జారీ చేసిందా? అనే అంశంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement