3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత | Cm revanth Reddy will launch the rollout of new smart ration cards | Sakshi
Sakshi News home page

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత

Aug 12 2026 12:18 AM | Updated on Aug 12 2026 12:18 AM

Cm revanth Reddy will launch the rollout of new smart ration cards

సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట్’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనుండగా, అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల సంస్థ అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోనూ మాట్లాడి ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు.

ఏడాదిన్నరలో 16.32 లక్షల కొత్త కార్డులు
2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసి, వాటి ద్వారా 61,08,544 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. తెలంగాణలో ఆహార భద్రత కార్యక్రమం ఏ స్థాయిలో కొనసాగుతోందో ఇందుకు ప్రభుత్వం చేస్తున్న వ్యయమే నిదర్శనమన్నారు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు.

లబ్ధిదారుడికి ఇబ్బంది కలగొద్దు
సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల తరలింపు, సీటింగ్, భద్రత, కార్డుల పంపిణీతో పాటు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన మినిట్-టు-మినిట్ షెడ్యూల్ సిద్ధం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వాస్తవ లబ్ధిదారులను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీలో లబ్ధిదారుల గుర్తింపును ధ్రువీకరించి, పూర్తి పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.

‘ప్రతి అర్హుడికీ ఆహార భద్రతే లక్ష్యం’
‘‘తెలంగాణలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నాం. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. ఇంత భారీ సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా లబ్ధిదారుడి చెంతకు తీసుకెళ్లడమే స్మార్ట్ రేషన్ కార్డుల లక్ష్యం’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆహార భద్రత కార్యక్రమం విస్తృతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 1.06 కోట్ల కార్డులు–3.43 కోట్ల లబ్ధిదారులు–ఉచిత సన్నబియ్యం వంటి కీలక అంశాలతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో పాటు షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.

ఆగస్టు 15 నాటికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, సంగారెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమంతో పాటు 33 జిల్లాల్లో జరిగే పంపిణీ కార్యక్రమాలను క్రమశిక్షణతో, పారదర్శకంగా, నిర్వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement