సాక్షి,హైదరాబాద్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి సి.ఈ ధర్మారెడ్డి,పలువురు అధికారులు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని,నిర్లక్ష్యాన్ని,పనుల్లో ఆలస్యాన్ని అస్సలు సహించేది లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
అటు వైపు నిత్యం ప్రయాణించే వారికి ఏళ్ల తరబడి నరకప్రాయంగా మారిందని,అందుకోసమే 2026 దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం...మాట ప్రకారం చేసి తీరాల్సిందేనని సమీక్షలో మంత్రి పునరుద్ఘాటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పూర్తి జవాబుదారిగా వ్యవహరిస్తుందనీ,ఏళ్ల తరబడి అవస్థ పడుతున్న ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రయాణం అందించేలా చేద్దామని,అందుకు అనుగుణంగా అధికారులు మనసుపెట్టాలని ప్రత్యేకంగా కోరారు.
మ్యాన్ పవర్ పెంచి..మూడు షిఫ్టుల్లో పనులు చేయాలనీ,రాత్రి వేళల్లో 11 నుండి ఉదయం 6గంటల వరకు నిరంతరాయంగా పనులు జరగాలనీ మంత్రి ఆదేశించారు. కారిడార్ కింద 6.25కి.మీ బిటి రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు.
ప్రతి పది రోజులకు ఒకసారి తాను స్వయంగా క్షేత్రస్థాయి పనుల పురోగతి సమీక్షిస్తానని..అందుకు తగ్గట్టుగా రోజువారీ వర్క్ ప్రోగ్రెస్ అధికారులు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు.
ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో నడుస్తున్న పనులపై మంత్రి కూలంకషంగా చర్చించారు.. సైట్ లోని కచ్చితమైన వాస్తవ పరిస్థితులు చెప్పాలని మంత్రి అధికారులు,వర్క్ ఏజెన్సీని అడిగారు.
ప్రస్తుతం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 60% మేర పనులు పూర్తయ్యాయని మరో 40% పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు వివరించారు. సైట్లో సెగ్మెంట్ తయారు చేయుటకు నాలుగు బెడ్లు,నాలుగు గ్యాంట్రీస్ తో 300మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారనీ మంత్రికి చెప్పారు.
అటు నారపల్లి(CPRI) వైపు నుండి,ఇటు ఉప్పల్ వైపు నుండి..ఇరువైపుల లాంచింగ్ గడ్డర్లతో పనుల్లో వేగం పెంచాలనీ మంత్రి సూచించారు. ఉప్పల్ వైపు నుండి జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి ఆరా తీశారు..ఇప్పటికే ఒక స్లాబ్ పూర్తయిందని,రెండో స్లాబ్ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రిపూట పనుల వల్ల,వర్షాల వల్ల నిర్మాణం పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదనీ నిర్మాణ సంస్థ సమీక్ష సందర్భంగా విజ్ఞప్తి చేసింది. 2026 అక్టోబర్ 31 నాటికి అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకున్నాం..ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు గురించి ఆలోచించాలని మంత్రి అన్నారు. వర్క్ ఏజెన్సీ విజ్ఞప్తి పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల్లో మరింత వేగం పెంచాలని,మ్యాన్ పవర్ పెంచి మూడు షిఫ్టుల్లో పనిచేయాలని తెగేసి చెప్పారు. నెలకు ఆరు స్లాబుల చొప్పున పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ మంత్రికి తెలిపింది. దీనికి అనుసంధానంగా GHMC నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులపై ఆరా తీసిన మంత్రి GHMC అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు సమాంతరంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందేనని ఆర్ అండ్ బి అధికారులు,వర్క్ ఏజెన్సీ ఆ దిశగా పనిచేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.


