బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిందే.. | Disabled Woman Plea to Free Husband from Saudi Jail Over 84 Lakh Blood Money | Sakshi
Sakshi News home page

బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిందే..

Aug 11 2026 1:53 PM | Updated on Aug 11 2026 2:31 PM

Disabled Woman Plea to Free Husband from Saudi Jail Over 84 Lakh Blood Money

నిజామాబాద్‌: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌ జైలులో మగ్గుతున్నాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను పట్టుకుని భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తమ బిడ్డ తిరిగి రావాలని ఆ యువకుడి తల్లిదండ్రులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ఆశతో వలస వెళ్లిన యువకుడు శ్రావణ్‌కుమార్‌ కుటుంబ పరిస్థితి ఇది. 

సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్‌ (32). జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతల్‌పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను 2022లో శ్రావణ్‌ పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్‌లో ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశం రియాద్‌కు వెళ్లిన శ్రావణ్‌ అక్కడి ఓ ప్రైవేట్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కంపెనీలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిలో చేరాడు. మంచి ఉద్యోగం రావడంతో తన కలలు సాకరమవుతాయని సంబురపడిన శ్రావణ్‌పై కోలుకోలేని దెబ్బపడింది.  

2024 మే 6వ తేదీన శ్రావణ్‌ నడుపుతున్న అంబులెన్స వాహనం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదంలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి పోలీసులు శ్రావణ్‌ను అరెస్టు చేసి జైలు తరలించారు. కొన్ని నెలల్లోనే అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రోడ్డు ప్రమాద ఘటనకు శ్రావణ్‌కుమార్‌ను నేరస్థుడిగా నిర్ధారించింది. రూ.3.30 లక్షల సౌదీ రియాళ్లు (బ్లడ్‌ మనీ – రక్తపరిహారం) బాధితకుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మన దేశ కరెన్సీలో ఆ మొత్తం సుమారు రూ.84 లక్షలు. బాధిత కుటుంబాల అంగీకారం మేరకు పరిహారం చెల్లిస్తే శ్రావణ్‌కుమార్‌కు జైలు నుంచి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. 

పరిహారం చెల్లించకపోతే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అంత పెద్ద  మొత్తంలో పరిహారం  చెల్లించే ఆర్థిక స్థోమత లేక శ్రావణ్‌కుమార్‌ కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ్‌కుమార్‌ పై అక్కడి దేశం ట్రావెలింగ్‌ బ్యాన్‌ ఆంక్షలు పెట్టింది.  

గడపగడపకు వెళ్తున్న మమత 
తన భర్తను జైలు నుంచి విడిపించాలని దివ్యాంగురాలైన మమత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు  నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీకి, పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసింది. ఈ ఏడాది మే 29న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో తమ పరిస్థితిని వివరించింది. తన భర్తను తీసుకురావాలని వేడుకుంది.   

ప్రభుత్వం ఆదుకోవాలి  
మాది నిరుపేద కుటుంబం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నా కొడుకు రెండేళ్ల నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నాడు. రెక్కల కష్టంపై బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి.  
– కుమ్మరి రామయ్య, శ్రావణ్‌కుమార్‌ తండ్రి 

మమ్మల్ని ఆదుకోండి 
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందిస్తేనే మా కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. నేనే దివ్యాంగురాలిని చంటి బిడ్డను పట్టుకుని తిరుగుతున్నా. మా అత్తామామలు తల్లడిల్లుతున్నారు. సౌదీ అరేబియా కోర్టు చెప్పిన జరిమానా చెల్లించే స్థోమత మాకు లేదు.  
– మమత, శ్రావణ్‌కుమార్‌ భార్య

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement