హెల్మెట్‌ లేకపోవడం వల్లే 54 వేల మందికి పైగా మృతి.. గడ్కరీ షాకింగ్‌ నిజాలు! | Every Hour, 20 People Die On Our Roads, Says Nitin Gadkari | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ లేకపోవడం వల్లే 54 వేల మందికి పైగా మృతి.. గడ్కరీ షాకింగ్‌ నిజాలు!

Aug 11 2026 5:26 AM | Updated on Aug 11 2026 5:32 AM

Every Hour, 20 People Die On Our Roads, Says Nitin Gadkari

న్యూఢిల్లీ: మన దేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో యుద్ధాలు, వ్యాధుల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ ప్రాణాలను బలితీసుకుంటున్నాయని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. 

దేశంలో ప్రతి ఏడాది దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  వాటిలో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో 66 శాతం మంది యువతే ఉండటం అత్యంత బాధాకరం. గతేడాది హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే 54,132 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 45 శాతం ద్విచక్ర వాహనదారులవే. ‘ప్రతి గంటకు మన రోడ్లపై 20 మంది చనిపోతున్నారు. ఇంతటి స్థాయిలో మరణాలు యుద్ధాల్లో, వ్యాధుల్లో కూడా కనిపించవు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బ్లాక్‌ స్పాట్ల తొలగింపునకు రూ.40 వేల కోట్లు
ప్రమాదాలకు కారణమవుతున్న ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్‌ స్పాట్లు) తొలగించేందుకు కేంద్రం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. భారత్‌ ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రోడ్డు నెట్‌వర్క్‌ కలిగిన దేశంగా ఎదిగింది. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశంగా ఉండటం విచారకరం. 

మానవ ప్రవర్తనే అతిపెద్ద సమస్య
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో మౌలిక వసతులు, చట్టాల అమలుతో పాటు ప్రజల ప్రవర్తనలో మార్పు కూడా అవసరం. మానవ ప్రవర్తనే మన అతిపెద్ద బలహీనత అన్న ఆయన రోడ్డు భద్రతపై చిన్న వయసు నుంచే అవగాహన కల్పించేందుకు 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ జీడీపీలో ప్రతి ఏడాది దాదాపు 3 శాతం నష్టం వాటిల్లుతోంది. రోడ్డు భద్రత ప్రభుత్వానిదే బాధ్యత కాదు. ప్రజలు, సంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడవచ్చని గడ్కరీ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement