సంతోష్ (ఫైల్)
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి మెకానిక్ మృతి
జీడిమెట్ల (హైదరాబాద్): డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో.. మరమ్మతులు చేస్తున్న మెకానిక్ మృతి చెందాడు. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌కు చెందిన మదన సంతోష్ జీడిమెట్ల బస్ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం 6గంటలకు డ్యూటీకి వచ్చిన సంతోష్ (39) బస్సు బ్రేకులకు మరమ్మతులు నిర్వహిస్తున్నాడు.
అనంతరం సంతోష్ మెకానిక్ షెడ్డులోని బస్సు కింద రిపేర్ గుంత నుంచి పైకి వస్తున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ కృష్ణారావు సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సును నిర్లక్ష్యంగా నడిపాడు. బస్సు కింద రెండు టైర్ల మధ్య ఉండే హెచ్‌బీమ్ రాడ్డు సంతోష్ తలకు బలంగా తాకింది. దాని మధ్యలో తల ఇరుక్కుపోవడంతో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంతోష్‌కు భార్య ధనశ్రీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కృష్ణారావుపై కేసు నమోదు చేశారు.


