ఆఖరి క్షణంలో అరుదైన బేరం.. ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాల జోరు
మిగిలిపోయిన సీట్లన్నీ స్పాట్‌లోకి... ఏజెన్సీలు, కన్సల్టెన్సీల హడావుడి
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ సీట్ల ‘స్పాట్’అడ్మిషన్లకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న దీనిని చేపట్టేందుకు సాంకేతిక విద్యామండలి అనుమతించింది. దీంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడి మొదలైంది. కన్సల్టెన్సీలు, ఏజెంట్లు, మధ్యవర్తులు ఒక్కసారిగా తెరమీదకొచ్చారు. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను కూడా స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తారు. ఆ క్షణంలో ఎవరు కాలేజీకి వస్తే వారికి సీటు ఇవ్వొచ్చు. కాబట్టి కాలేజీ యాజమాన్యాలకు ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తాయి.
ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో కొంతమంది చేరేందుకు ఇష్టపడలేదు. దీంతో సీట్లు మిగిలిపోవడం సహజం. ఈ స్థానంలోకి ఇతర బ్రాంచ్‌ల విద్యార్థులు ఆప్షన్ ఇచ్చేందుకు బుధ, గురువారాల్లో ఇంటర్నల్ స్లైడింగ్ చేపడుతున్నారు. ఇది పూర్తయితే ఇంకా ఎన్ని సీట్లు మిగిలిపోతాయనేది తెలుస్తుంది.
యాజమాన్య, కన్వినర్ కోటాలో మిగిలిపోయిన సీట్లన్నీ స్పాట్‌లో భర్తీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 94,156 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీకి అందుబాటులో ఉన్నాయి. రెండు దశల కౌన్సెలింగ్‌లో 75,054 సీట్లు కేటాయించారు. ఇంకా 19,102 సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్నల్ స్లైడింగ్ పూర్తయిన తర్వాత ఈ సీట్లు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుంది.
డిమాండ్ చేద్దాం... లేదంటే ఎంతో కొంత...
కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ వంటి కోర్సుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయినా, 11,600 సీట్లు రెండో దశ కౌన్సెలింగ్ పూ ర్తయ్యే నాటికి ఉన్నాయి. స్లైడింగ్ తర్వాత ఇవి 9 వేల వరకూ ఉండొచ్చని ఆప్ష న్లను బట్టి తెలుస్తోంది. విద్యార్థుల్లో కంప్యూటర్ కోర్సులపై ఉన్న డిమాండ్‌ను స్పాట్‌లో సొమ్ము చేసుకునేందుకు కాలేజీ యాజమాన్యాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
వాస్తవానికి ఈ సీట్లను యాజమాన్య కోటాకింద 15 రోజుల క్రితం వరకూ ఒక్కో సీటు కనిష్టంగా రూ.6 లక్షలు, గరిష్టంగా రూ.14 లక్షల వరకూ అమ్ముకున్నాయి. ఇప్పుడు కనీసం రూ.3 లక్షలు, గరిష్టంగా రూ. 7 లక్షల వర కూ అమ్ముకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకే ఏజెన్సీలు, కన్సల్టెన్సీ సంస్థలకు ఎంత కమీషన్ అయినా ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధపడుతున్నాయి.


