ఒక గ్రామం సంకల్పిస్తే సామాజిక మార్పు ఎంత వేగంగా సాధ్యమవుతుందో రామచంద్రాపూర్ నిరూపించింది. మద్యం కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోందని, యువత భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతోందని గుర్తించిన గ్రామప్రజలు రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చారు.గ్రామసభలో చారిత్రాత్మక తీర్మా నం చేసి ఇకపై గ్రామంలో బెల్ట్ షాపులకు చోటు లేదని తేల్చిచెప్పారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా విధించడంతోపాటు సమాచారం అందించిన వారికి రూ.10వేల నగదు బహుమతి ప్రకటించడం ఈ నిర్ణయానికి మరింత బలం చేకూర్చింది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రాపూర్‌లో తీసుకున్న ఈ నిర్ణయం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది.
సర్పంచ్ వై.నర్సింహులు అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మహిళలు, యువకులు, రైతులు, కూలీలు, గ్రామపెద్దలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో కొనసాగుతున్న మద్యం విక్రయాలతో కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం, గృహహింస, ఆరోగ్య సమస్యలు, యువతలో వ్యసనాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం గ్రామంలో సుమారు 12 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఆలయాల పరిసరాల్లోనే మద్యం విక్రయాలు సాగుతుండటంతో విద్యార్థులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని గ్రామసభలో చర్చించారు. దీంతో వారం రోజుల్లో అన్ని బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని తీర్మానించారు.
గ్రామంలో ఎవరైనా రహస్యంగా మద్యం విక్రయించినా, నిల్వ ఉంచినా, బెల్ట్‌షాపు నిర్వహించినా రూ.50వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. సమాచారాన్ని అందించిన వారికి రూ.10వేల నగదు నజరానా ఇవ్వాలని కూడా గ్రామసభ ప్రకటించింది. గ్రామసభ తీర్మానాన్ని ఉల్లంఘించే వారిపై గ్రామస్తుల సమక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సుమారు 4వేల జనాభా ఉన్న రామచంద్రాపూర్‌లో అధికశాతం కుటుంబాలు వ్యవసాయ, దినసరి కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. సంపాదించిన కూలీ మద్యం కోసం ఖర్చవుతూ కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయని గ్రామపెద్దలు పేర్కొన్నారు. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోవడం, మహిళలు వేధింపులకు గురికావడం, కుటుంబ కలహాలు పెరగడం వంటి సమస్యలకు మద్యమే ప్రధాన కారణమని గ్రామసభలో అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయం కేవలం బెల్ట్‌షాపులు మూసివేయడానికే పరిమితం కాదని, గ్రామంలో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నెలకొల్పే సామాజిక ఉద్యమానికి శ్రీకారమ ని సర్పంచ్ తెలిపారు. గ్రామప్రజల సహకారంతో సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రామచంద్రాపూర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. గ్రామస్తులే ముందుండి సామాజిక బాధ్యతతో తీసుకున్న ఈ తీర్మానం విజయవంతమైతే గ్రామీణ సమాజంలో కొత్త మార్పుకు నాంది పలికే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
మహబూబ్‌నగర్


