నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా కౌన్సెలింగ్‌ | MBBS and BDS Management Quota Counseling from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా కౌన్సెలింగ్‌

Aug 13 2026 1:16 AM | Updated on Aug 13 2026 1:16 AM

MBBS and BDS Management Quota Counseling from today

20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో  రిజిస్ట్రేషన్‌కు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 13 ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 20 సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో  రిజిస్ట్రేషన్‌ చేసుకొని ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. వెబ్‌ ఆప్షన్ల తేదీలను తర్వాత ప్రకటిస్తారు. 

నీట్‌–2026లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కనీస అర్హత 213 మార్కులు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 177 మార్కులుగా నిర్ణయించారు. మేనేజ్‌మెంట్‌ కోటాలోని బీ కేటగిరీ సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను దేశవ్యాప్తంగా అభ్యర్థులతో భర్తీ చేస్తారు. సీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.12 వేలు చెల్లించాలి. ఈ ఫీజు తిరిగి చెల్లించరు. 

ఎంబీబీఎస్‌ బీ కేటగిరీకి విశ్వవిద్యాలయ ఫీజు రూ.40 వేలు, సీ కేటగిరీ/ఎన్‌ఆర్‌ఐకి రూ.70 వేలు ఉంటుంది. బీడీఎస్‌కు వరుసగా రూ.20 వేలు, రూ.40 వేలు చెల్లించాలి. ట్యూషన్‌ ఫీజు మాత్రం ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌ 98 ప్రకారం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల సంఖ్యను ప్రస్తుతం ప్రకటించలేదు. ఎన్‌ఎంసీ, ఎన్‌డీసీ అనుమతించిన సీట్ల మేరకు కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెబ్‌ ఆప్షన్లకు ముందు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. కాగా, ఎంపికైన విద్యార్థులు కోర్సులో చేరిన తర్వాత మధ్యలో చదువు మానేస్తే రూ.20 లక్షల డిస్‌కంటిన్యూయేషన్‌ బాండ్‌ అమలు కానుంది. నిబంధనల ప్రకారం మూడేళ్లపాటు తెలంగాణలో ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ ప్రవేశాలకు అనర్హత కూడా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement