రెండు రోడ్డు ప్రమాదాలు.. 8మందిమృతి | Two road accidents leave 8 dead | Sakshi
Sakshi News home page

రెండు రోడ్డు ప్రమాదాలు.. 8మందిమృతి

Aug 12 2026 5:00 AM | Updated on Aug 12 2026 5:00 AM

Two road accidents leave 8 dead

ఆటోను ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం

వీరిలో ఐదుగురు కర్ణాటకకు చెందిన మహిళా కూలీలు

డివైర్‌ను ఢీకొట్టి కారు ఎగిరి పడిన ఘటనలో ఇద్దరు మృతి 

సంగారెడ్డి జిల్లాలో దుర్ఘటనలు ∙మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /జహీరాబాద్‌ టౌన్‌: సంగారెడ్డి జిల్లా పరిధిలో 65వ జాతీయరహదారిపై మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్‌ మండలం సత్వార్‌ వద్ద ఆటోను వెనుక నుంచి ట్యాంకర్‌ బలంగా ఢీ కొట్టడంతో నలుగురు మహిళా కూలీలు రేఖ, శ్రీదేవి, కవిత, రేష్మ, ఆటో డ్రైవర్‌ దేవదాస్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ భార్య, కూలీ నిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. 

మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గాయాలపాలైన ఏడుగురిని బీదర్, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా కర్ణాటకలోని రాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన వారు. వీరంతా పనుల కోసం జహీరాబాద్‌ ప్రాంతానికి వచ్చి.. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో జహీరాబాద్‌ వైపు నుంచి కర్ణాటకలోని తమ సొంతూరు రాజ్‌పూర్‌ వైపు వెళ్తుండగా ఓ లారీ యూ టర్న్‌ తీసుకుంటోంది. 

ఆ లారీని తప్పించబోయిన డ్రైవర్‌ ఆటోను పక్కకు తీయడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్యాంకర్‌ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనాన్ని గమనించకుండా పక్కకు తిప్పడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పరిశీలించారు. 

డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి పడిన కారు  
సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం వెంకటాపూర్‌ చౌరస్తా వద్ద ఇదే హైవేపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జహీరాబాద్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి రోడ్డుకు అవతలి వైపు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ ఉద్యోగి మల్లన్న, శంకర్‌ మృతి చెందారు. వీరు సదాశివపేటకు చెందిన వారుగా భావిస్తున్నారు. 

సీఎం దిగ్భ్రాంతి: సత్వార్‌ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement