ఆర్సీలో ఫొటో గాయబ్‌ | No more photos on Vahan portal | Sakshi
Sakshi News home page

ఆర్సీలో ఫొటో గాయబ్‌

Aug 12 2026 4:55 AM | Updated on Aug 12 2026 4:55 AM

No more photos on Vahan portal

వాహన్‌ పోర్టల్‌లో ఫొటోలకు స్వస్తి 

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాల్లో యజమాని ఫొటో మాయమైంది. కొత్త వాహనాల నమోదు, పాత వాటి బదిలీలు, యాజమాన్య మార్పులు, తదితర పౌరసేవల్లో రవాణాశాఖ ఫొటో గుర్తింపును గతంలో తప్పనిసరి చేసింది. బండి రిజిస్ట్రేషన్ సమయంలోనే డిజిటల్‌ ఫొటోలను, సంతకాలను నమోదు చేసేవారు. దీనివల్ల వాహనాలు అడ్డగోలుగా ఒకరి నుంచి మరొకరికి బదిలీ కాకుండా నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. మొదట్లో తమిళనాడు ప్రభుత్వం ఈ ఫొటో గుర్తింపు పద్ధతిని ప్రవేశపెట్టింది.

ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా సుమారు 15 ఏళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చారు. కానీ, దేశవ్యాప్తంగా కేంద్రమోటారు వాహన చట్టం నిబంధనలను ఏకీకృతంగా అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన ‘వాహన్‌’పోర్టల్‌ రాకతో ఆర్సీల్లో ఫొటో గుర్తింపు లేకుండా పోయింది. గతంలో ఉన్నట్లుగా సాధారణ పద్ధతిలోనే వాహనదారుల చిరునామా, తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ స్మార్ట్‌ కార్డులను అందజేస్తున్నారు. ఫొటోలు లేకుండా స్మార్ట్‌కార్డులు రావడంతో వాహనదారులు పాత కార్డులతో పోల్చుకొని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

బదిలీల్లో మోసాలు..: సెకండ్‌ హ్యాండ్‌ వ్యక్తిగత, వాణిజ్య వాహనాల విక్రయ సమయంలో విక్రేత, కొనుగోలుదారు ఆర్టీఏ అధికారి సమక్షంలో వివిధ పత్రాలపై∙సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఫొటో గుర్తింపు ఆధారంగా వాహన యజమానిని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దీన్ని తొలగించడం వల్ల యజమానుల ప్రమేయం లేకుండానే మరొకరికి బదిలీ అయ్యే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, కేంద్ర వాహన చట్టంలో ఫొటో గుర్తింపు నిబంధన లేదని, ‘వాహన్‌’పోర్టల్‌తో దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేస్తుందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement