కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలా? | High Court issues contempt notice to Ranganath | Sakshi
Sakshi News home page

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలా?

Aug 13 2026 1:45 AM | Updated on Aug 13 2026 1:46 AM

High Court issues contempt notice to Ranganath

రంగనాథ్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు 

‘వాణి కో–ఆపరేటివ్‌’కూల్చివేతపై సుమోటోగా కేసు 

రెవెన్యూ శాఖ సూచనలు లేకుండా కూల్చడంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని సర్వే నంబర్‌ 194/1లోని వాణి కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లేఅవుట్‌లోని ప్లాట్లకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసిన న్యాయస్థానం నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెవెన్యూ అధికారులు.. తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెబుతున్నప్పుడు కూల్చివేత ఎలా చేపట్టారని నిలదీసింది. ఎవరినీ సంప్రదించకుండానే కోర్టు పరిధిలోని అంశంలో ఇష్టానుసారం జోక్యం చేసుకోవడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రంగనాథ్‌ చర్యల కారణంగా ఇతర అధికారులు వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడింది. సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ను ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రాకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. జూలై 18న తమ ప్రాపర్టీ చుట్టూ ఉన్న కాంపౌండ్‌ వాల్‌ను అధికారులు కూల్చివేయడాన్ని సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన లింగారావు తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించారని, కూల్చివేసిన ప్రహరీని పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి ఎమ్మార్వో, తిరుమలగిరి తహసీల్దార్లు హాజరు కావాలన్న గత ఆదేశాల మేరకు వారు కోర్టుకు హాజరయ్యారు.  

ఆ ఆస్తుల వివరాలివ్వండి.. 
రెవెన్యూ శాఖ తరఫున జీపీ కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సర్వే నంబర్‌ 194లో 12 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. ఇందులో నాలుగెకరాలు యూఎల్‌సీ కింద సర్కార్‌కు హక్కులు దఖలుపడ్డాయన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కూల్చివేత సమయంలో సర్వేయర్లు, తహసీల్దార్లు ఉన్నారా అని ప్రశ్నించగా, ఎవరూ లేరని రెవెన్యూ అధికారులు బదులిచ్చారు. కూల్చివేతపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదన్నారు. మరి ఎలా కూల్చివేశారని హైడ్రాను ప్రశ్నించారు. 

ప్రభుత్వ సర్వేయర్లు రానప్పుడు ప్రైవేట్‌గా ఎవరినైనా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఎన్ని కూల్చివేతలు చేపట్టారని అడిగారు. 30 నుంచి 40 దాకా కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు. రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు, సంబంధిత రికార్డులు లేకుండానే జీఎల్‌ఆర్‌ నంబర్లు 243, 255ను సర్వే నంబర్‌ 194/1తో అనుసంధానించి కూల్చివేతలు, ఫెన్సింగ్‌ చేపట్టినట్లు న్యాయమూర్తి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో గతంలో వివిధ రిట్‌ పిటిషన్లలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల నుంచి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే ప్రహరీలను కూల్చివేసి, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినట్లు ప్రాథమికంగా తేలడంతో రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ వ్యవహారంలో హైడ్రాపై సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాగే, హైడ్రా ఏర్పాటుకు ముందు వివిధ రిట్‌ పిటిషన్లలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు హైడ్రాకు తెలియజేయకపోవడంతో అవి ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇకపై హైడ్రా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో అమల్లో ఉన్న కోర్టు ఉత్తర్వులను హైడ్రాకు తప్పనిసరిగా తెలియజేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement