‘అనర్హత’పిటిషన్లలో పిటిషనర్ల వాదనలు
విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అనంతరం కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమంటే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని ‘అనర్హత’పిటిషన్లలో పిటిషనర్లు వాదించారు. అధికారికంగా పార్టీకి రాజీనామా చేయకపోయినా.. మరో పార్టీ టికెట్‌పై పోటీ చేయడం, ప్రచారం చేయడం వంటి చర్యలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతను నిర్ణయించే విషయంలో శాసనసభ స్పీకర్ అధికార పరిధికి పరిమితులున్నాయని చెప్పారు. శాసనసభలో ప్రభుత్వ స్థిరత్వం దెబ్బతిన్నదా? పార్టీ బలం తగ్గిందా? అన్నది కాకుండా.. సంబంధిత సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారా? అన్నదే పరిశీలించాల్సిన అంశమని పేర్కొన్నారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వివేక్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్‌రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్‌కుమార్.. కాంగ్రెస్‌లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్.. చట్టపరంగా వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, పల్లె రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డితో పాటు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతివాదులుగా స్పీకర్‌తోపాటు పార్టీ మారినట్లు ఆరోపణలున్న వారిని కూడా చేర్చారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమా ర్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
దానం అంగీకరించినట్టే...: వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పార్టీ సభ్యత్వాన్ని సభలోనే వదులుకోవాలన్న పరిమితి లేదని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పదో షెడ్యూల్ ఉద్దేశం కేవలం సభలో ‘ఫ్లోర్ మేనేజ్‌మెంట్’కాదని.. ప్రజ లు ఇచ్చిన రాజకీయ తీర్పును పార్టీ మార్పు ల ద్వారా నిర్వీర్యం కాకుండా చూడటమేనన్నారు. దానం నాగేందర్.. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు చూపించే గెజిట్, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చూపించే గెజిట్, ఫారం–26 అఫిడవిట్‌లను ఆధారాలుగా ఆయన సమర్పించారు.
ఎమ్మెల్యేగా ఎన్నిక, ఎంపీగా పోటీపై సమర్పించిన సాక్ష్యాలను దానం తిరస్కరించలేదని, వాటిని అంగీకరించినట్లేనని.. అలాంటప్పుడు మళ్లీ నిరూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక పార్టీపై గెలిచి, మరో పార్టీ తరఫున పోటీ చేస్తే అసలు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని 2019లో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.


