సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో గతేడాది జనవరి 16న తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఎట్టకేలకు చిక్కారు. వీరిని బీదర్ పోలీసులు బుధవారం బిహార్‌లో పట్టుకున్నారు. బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన వీరిద్దరూ 2023లో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి నేరమే చేయడంతో అక్కడి వారికీ వాంటెడ్‌గా ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకుంటోంది. అలోక్ కుమార్ నేతృత్వంలోని ఈ ముఠాలో అమన్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్ని సభ్యులుగా ఉండేవారు.
2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జైసింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంక్ పెట్టెతో ఉడాయించారు. 2024 సెప్టెంబర్‌లో చందన్ కుమార్‌ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలీలో యూపీ ఎస్టీఎఫ్ పట్టుకుంది. అప్పట్లో అమన్, అలోక్‌లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్ జన్‌ధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వేట ముమ్మరం చేయగా... ఇరువురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతేడాది జనవరి 16న బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు.
కూకట్‌పల్లి ప్రాంతంలో షెల్టర్..
నగరంలో కూకట్‌పల్లి ప్రాంతంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టికెట్ బుక్ చేసుకున్నాడు. అక్కడ మేనేజర్ జహంగీర్‌ను కాల్చి పారిపోయారు. ఈ హత్యాయత్నంపై అఫ్జల్‌గంజ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చెన్నై వరకు వెళ్లినట్లు అఫ్జల్‌గంజ్ పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం సాధ్యం కాలేదు. ఈ ద్వయం కోసం ముమ్మరంగా వేటాడిన బీదర్ పోలీసులు బీహార్‌లో పట్టుకున్నారు. దీంతో ఈ వీరిని త్వరలో పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


