కాసరగోడ్/ఎర్నాకులం: నిశ్చితార్థం అయిన ఒక జంట గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. కాసరగోడ్ జిల్లా పూచ్చక్కాడ్ ప్రాంతానికి చెందిన పి. అనుశ్రీ (25), ఇరిట్టీ అంబలత్తట్టకు చెందిన వి. అమల్ (26)లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ఉద్యోగులు. అనుశ్రీ కర్ణాటకలో విధులు నిర్వహిస్తుండగా, అమల్ ఎర్నాకులంలో పనిచేస్తున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం అనుశ్రీ నివాసంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డిసెంబర్ 26న వీరి వివాహం జరగాల్సి ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుశ్రీ మంగళవారం రాత్రి వరకు బ్యాంకు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె సోదరి ఫోన్ చేసినప్పుడు అమల్‌తో ఫోన్లో మాట్లాడుతున్నానని అనుశ్రీ తెలిపింది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చేసిన ఫోన్ కాల్స్‌కు ఆమె స్పందించకపోవడంతో , అనుమానం వచ్చి ఆమె ఇంటి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అనుశ్రీ విగతజీవిగా పడి ఉంది. హున్సూర్ పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం బుధవారం సాయంత్రం ఆమె భౌతికకాయాన్ని పూచ్చక్కాడ్ లోని ఇంటికి చేరలించారు. కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు ఎర్నాకులం ఎంజీ రోడ్డు ఎస్‌బీఐ శాఖలో పనిచేస్తున్న అమల్ అదే ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఉంటున్నారు. అనుశ్రీ మృతి చెందిన విషయం తెలుసుకున్న అమల్, బుధవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో ఎర్నాకులం నార్త్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. ఆ తర్వాత తన స్నేహితులకు తన లొకేషన్‌ను షేర్ చేశారు. ఎంతకీ ఆయన ఫోన్ స్పందించకపోవడంతో స్నేహితులు లాడ్జికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, అమల్ విగత జీవిగా కనిపించారు. త్వరలో వివాహం జరగాల్సిన జంట ఇలా మృత్యువాత పడటంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం అలముకుంది.
ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ఏనుగు, దాని పిల్ల మృతి


