సీజేపీ దాస్‌ ఇంటికి పోలీసులు.. బీజేపీ ప్లాన్‌ మార్చిందా? | CJP Saurav Das alleges Puducherry police intimidated family | Sakshi
Sakshi News home page

సీజేపీ దాస్‌ ఇంటికి పోలీసులు.. బీజేపీ ప్లాన్‌ మార్చిందా?

Aug 13 2026 9:27 AM | Updated on Aug 13 2026 9:42 AM

CJP Saurav Das alleges Puducherry police intimidated family

పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్‌ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని ప్రశ్నల పేరుతో భయబ్రాంతులకు గురిచేశారని దాస్ ఆరోపించగా.. పోలీసు శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చేపట్టే సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఇంటికి వెళ్లామని స్పష్టం చేసింది.

పోలీసులు తమ కుటుంబం వద్దకు వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది కేవలం సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని దాస్ ప్రశ్నించారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అసలు ఇలాంటి విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయించాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తమ పోరాట సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.

అంతేకాదు, రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరికి వచ్చి అక్కడి హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని సందర్శించే నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, పోలీసుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను పోలీసులు సందర్శించడం సాధారణమేనని చెప్పారు.

ముఖ్యమైన రూట్లకు సమీపంలో నివసించే ప్రజలను కలిసి కొన్ని వివరాలు తెలుసుకోవడం, భద్రతకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు అడగడం పోలీసుల రొటీన్ ప్రక్రియలో భాగమని అధికారి వివరించారు. దీంతో ఒకే ఘటనపై రెండు భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. దాస్ మాత్రం దీన్ని రాజకీయ బెదిరింపుగా చూస్తుండగా.. పోలీసులు మాత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చేపట్టే సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమని చెబుతున్నారు. ఇక దాస్ చేసిన వ్యాఖ్యలు పుదుచ్చేరి రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా పర్యటనను ఈ ఘటనతో ముడిపెడుతూ ఆయన ప్రశ్నలు లేవనెత్తడంతో రాజకీయ కోణం కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పుదుచ్చేరిలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement