ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తా
తేల్చిచెప్పిన హోంమంత్రి అమిత్ షా
ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. విద్యార్థుల నిరసనలు, ఇతర అంశాలపై చర్చ కోసం లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ సమర్పించాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. చర్చ ప్రారంభమైన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. చర్చలో పూర్తిగా పాల్గొంటానని వెల్లడించారు.
బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. చర్చలో పాల్గొనాలా లేక పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించాలా అనేది ఇప్పుడు ప్రతిపక్షం చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం 2 గంటలలోపు స్పీకర్‌కు లేఖ సమర్పించాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏ రకమైన చర్చలకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని తెలిపారు.
తాను చర్చ నుంచి పారిపోతున్నానంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అదృశ్యం’, ‘పారిపోయినవారు’వంటి పదాలు భారతదేశ ప్రజా, పార్లమెంటరీ చర్చల్లో ఇటీవలి కాలంలోనే వినిపించడం మొదలయ్యాయని పేర్కొన్నారు. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా వచ్చి పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్‌లో కూర్చుంటున్నానని, ప్రతిపక్షం మాత్రం ఉభయ సభలనూ పనిచేయనివ్వడం లేదని విమర్శించారు.
సభలో కార్యకలాపాలను విపక్షాలు సాగనివ్వనప్పుడు ఎవరైనా లోపలికి వెళ్లడంలో ఇక అర్థం ఏమిటని ప్రశ్నించారు. నీట్ వ్యవహారానికి సంబంధించి విద్యార్థుల నిరసనలు సహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారని అమిత్ షా గుర్తుచేశారు. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు. కానీ, వారు(విపక్షాలు) అసలు చర్చ జరగాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు నిజంగా ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయించుకుంటారని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ప్రతిపక్షం ఎందుకు చర్చ జరగాలని కోరుకోవడం లేదనే అంశంపై చర్చించడానికీ సిద్ధంగా ఉన్నాననివివరించారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ
విద్యార్థుల నిరసనలపై చర్చ కోసం ప్రతిపక్షాలను సంప్రదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభలో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు బుధవారం స్పీకర్‌కు లేఖ రాశా రు.


