సాహస రైడ్‌ సరదా తీరకముందే.. | Dream Bike Ride Turns Tragic: Who is Mumbai Woman Biker Riddhi Thakkar | Sakshi
Sakshi News home page

సాహస రైడ్‌ సరదా తీరకముందే..

Aug 13 2026 7:54 AM | Updated on Aug 13 2026 8:00 AM

Dream Bike Ride Turns Tragic: Who is Mumbai Woman Biker Riddhi Thakkar

బైక్‌ రైడ్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే తరచూ సాహస యాత్రలు చేసే ఆమె.. మరో ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. కానీ ఆ సాహస యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఆమె బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బైకింగ్‌ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ముంబైకి చెందిన 24 ఏళ్ల యువ బైకర్‌ రిద్ధి థక్కర్‌(Riddhi Thakkar) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్‌ ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రిద్ధి.. వాటిని వీడియోలు తీస్తూ సోషల్‌ మీడియాలోనూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే.. బస్తర్‌ టూర్‌కు వెళ్లిన మహిళా బైకర్ల బృందంలో ఉన్న ఆమె అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు.  దీంతో.. బైకింగ్‌ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఢీ కొట్టి.. ఆపై ఈడ్చుకెళ్లి..
ముంబై కందివలీ వెస్ట్‌కు చెందిన రిద్ధి థక్కర్‌.. దాదాపు 23 మంది మహిళా బైకర్ల బృందంతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. రాయ్‌పూర్‌ నుంచి కాంకేర్‌ వైపు వెళ్తుండగా ధమ్తరి జిల్లా మార్కటోలా ఘాట్‌ సమీపంలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ల బృందంలోని పలువురు ముందుకు వెళ్లిపోగా, రిద్ధి మరికొందరు వెనుక వస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన భారీ ట్రైలర్‌ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రిద్ధి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.

ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం
ప్రమాదాన్ని గమనించిన తోటి బైకర్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి రిద్ధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ధమ్తరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పరారీలో డ్రైవర్‌.. కొనసాగుతున్న దర్యాప్తు
ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్‌ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ వాహనం, డ్రైవర్‌ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. రిద్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధమ్తరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెతో కలిసి ప్రయాణించిన ఇతర బైకర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ధమ్తరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement