రాష్ట్రాలకు సుప్రీం సూచన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనధికార నిర్మాణాల క్రమబద్ధీకరణ, కూల్చివేతలపై ఏకరూప విధానం రూపొందించే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అయితే ఈ దిశగా ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్ సెంటర్ ఫర్ లా అండ్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తిని తిరస్కరించింది.
ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తుందని సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆయా రాష్ట్రాల పరిస్థితులు, క్షేత్రస్థాయి వాస్తవాల్లో తేడాలు ఉంటాయి కాబట్టి ఏకరూప విధానం సముచితం కాదని అభిప్రాయపడింది. అయితే ఈ అంశానికి సంబంధించి కొత్త విధానాలు రూపొందించేటప్పుడు లేదా ఉన్నవాటిని సమీక్షించేటప్పుడు పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు సందర్భాల్లో అనధికార కాలనీలను ఎలాటి నోటీసుల్లేకుండా, పునారావాస/సంక్షేమ చర్యల్లేకుండా కూల్చి వేయడంతో చాలామంది ఆశ్రయం, జీవనోపాధి కోల్పోయారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా.. ఈ అంశాలపై కోర్టు ఇప్పటికే పలు రక్షణ చర్యలను అందుబాటోకి తెచి్చందని, కనీసం 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలని గతంలో ఆదేశించినట్లు చీఫ్ జస్టిస్ గుర్తుచేశారు.
తల దాచుకునేందుకు ఒక గూడు కలిగి ఉండటం గౌరవ మర్యాదలతో బతికేందుకు మనిషికి ఉన్న హక్కుల్లో భాగమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలోనే స్పష్టం చేసిందని, ఈ ఏడాది జూలై 14న కూడా దీర్ఘకాలం ఉనికిలో ఉన్నంత మాత్రాన అనధికార కాలనీలకు చట్టపరమైన హక్కులు రావని కూడా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని చీఫ్ జస్టిస్ తెలిపారు.


