ఆసుపత్రుల ఫీజు దోపిడీకి ముకుతాడు | Parliamentary Panel Recommends Major Reforms To Private Hospital Bills | Sakshi
Sakshi News home page

ఆసుపత్రుల ఫీజు దోపిడీకి ముకుతాడు

Aug 13 2026 6:05 AM | Updated on Aug 13 2026 6:05 AM

Parliamentary Panel Recommends Major Reforms To Private Hospital Bills

మెట్రోల్లో ఆసుపత్రి గది అద్దెలపై పరిమితులు 

ఆసుపత్రుల్లో జన ఔషధి కేంద్రాలు తప్పనిసరి 

ఖర్చుల అంచనాలు ముందుగానే ఇవ్వాలి 

దాతలు, బీమా పరిమితులపై వివరణకు ప్రత్యేక వ్యవస్థ 

పలు సిఫారసులు చేసిన పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజు దోపిడీల అడ్డుకట్టకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కీలక సిఫారసులు చేసింది. మెట్రో నగరాల్లోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో గది అద్దె సమీపంలోని త్రీస్టార్‌ హోటల్‌ సగటు టారిఫ్‌కు మించరాదని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో అందరికీ అందుబాటులో ఆరోగ్య సౌకర్యాలు’’పేరుతో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కమిటీ నివేదిక ప్రకారం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో గది అద్దెలను అత్యవసరంగా హేతుబదీ్ధకరించాల్సిన అవసరముందని తెలిపింది. 

3–స్టార్‌ హోటల్‌ టారిఫ్‌ ప్రాతిపదికగా మెట్రో నగరాల్లోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల గది ఛార్జీలు ఉండాలని, అవసరమైతే రెసిడెంట్‌ డాక్టర్, నర్సింగ్, వినియోగ వస్తువులు, భోజనం, లాండ్రీ వంటి ఖర్చులు కలపవచ్చునని తెలిపింది. అలాగే ఉన్నతస్థాయి ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక చికిత్సలు ప్రారంభించేందుకు ముందే రోగులకు ఖర్చులకు సంబంధించిన అంచనాలు సమగ్రంగా, చట్ట ప్రక్రియలకు లోబడి ఉండేలా అందించడం తప్పనిసరి అని తెలిపింది. చికిత్స ఖర్చులు, అందుబాటులో ఉన్న దాతృత్వ సంస్థలు, ఆరోగ్య బీమా పరిమితుల వంటి విషయాలను రోగులు, వారి కుటుంబ సభ్యులకు వివరించేందుకు ఆసుపత్రులు ప్రత్యేకంగా ఫైనాన్షియల్‌ నావిగేటర్స్‌ను నియమించాలని చెప్పింది. 

దేశంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం సామాన్యునికి భారంగా మారుతోందని, సగటున ఒక్కో రోగి తన చేతి నుంచి కనీసం రూ.34,064 ఖర్చు చేయాల్సి వస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ గుర్తించింది. వైద్యం తాలూకూ ద్రవ్యోల్బణం పది నుంచి పదమూడు శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. రక రకాల కేటగిరీల్లో రూమ్‌ఛార్జీలు వసూలు చేస్తూండటం వల్ల ద్రవ్యోల్బణం ఎగబాకుతున్నట్లు తెలిపింది. 

అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్దిష్ట చికిత్సలకు నిర్దిష్ట పద్ధతులు, మార్గదర్శకాలు ఉండాలని, ఏకపక్షంగా ఫీజులు వసూలును అరికట్టే ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

సంపూర్ణ వైద్యసేవలు...
అత్యవసర పరిస్థితుల్లో అందించే చికిత్సకు మాత్రమే వైద్యం పరిమితం కారాదని, వ్యాధుల నివారణ, స్క్రీనింగ్, నిర్ధారణ, క్యూరేటివ్‌ చికిత్స, పాలియేటివ్‌ వంటివన్నీంటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద ‘కంటిన్యూమ్‌ ఆఫ్‌ కేర్‌’రూపంలో అందించాలని తెలిపింది. కేన్సర్‌ వంటి వ్యాధుల చికిత్సలో అత్యాధునిక ఇమ్యూనోథెరపీ, జినోమిక్, టార్గెటెడ్‌ చికిత్సల ఖర్చులను తగ్గించడానికి సీఎస్‌ఆర్‌ నిధులు, విరాళాలు, ఛారిటబుల్‌ గ్రాంట్లతో జాతీయ/రాష్ట్ర స్థాయి ఆరోగ్య నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో మానిసిక వైద్యం, రోగులకు మద్దతుగా నిలవడాన్ని ఉచితంగా అందించాలని తెలిపింది.  

జన ఔషధి ఫార్మసీలు తప్పనిసరి... 
ఆయుష్మాన్‌ భారత్, పీఎంజేఏవై కింద నమోదైన ఆసుపత్రుల్లో అమృత్, జన్‌ ఔషధి ఫార్మసీలు తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో భాగంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ ద్వారా మందులు, వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని, ప్రాణాలు కాపాడే మందులు, పరికరాలపై లాభాలపై పరిమితులు పెట్టుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డిజిటల్‌ పద్ధతిలో మందులు, పరికరాలు నిత్యం అందుబాటులో ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.  

గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి... 
ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫారసు చేసింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం మొబైల్‌ యూనిట్లు, జిల్లా స్థాయిలో టెలి హెల్త్‌ సేవలను ప్రారంభించాలని, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆరోగ్య పరీక్షలకు అవసరమైన శాంపిళ్లను సేకరించి, రవాణా చేసేందుకు ఏర్పాట్లు ఉండాలని వివరించింది. ఇందుకోసం భారతీయ పోస్టల్‌ విభాగం సేవలను వాడుకోవాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి సగటున 3.5 ఆసుపత్రి బెడ్లు ఉండాల్సి ఉండగా.. దేశంలో ప్రస్తుతం ఈ సంఖ్య 1.3 మాత్రమే. ఇందులోనూ సగం కంటే ఎక్కువ ప్రభుత్వ రంగంలోనే ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement