ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్‌పై వేటు! | Fired Over WhatsApp Message AI Intern Viral Story Exposes Startup Exploitation | Sakshi
Sakshi News home page

ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్‌పై వేటు!

Jun 16 2026 8:46 AM | Updated on Jun 16 2026 11:02 AM

Fired Over WhatsApp Message AI Intern Viral Story Exposes Startup Exploitation

ఐటీ రంగంలో కొన్ని స్టార్టప్‌ల పనితీరు, ఇంటర్న్‌ల పట్ల యాజమాన్యాల ధోరణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక చర్చ వైరల్‌ అవుతుంది. కేవలం అర్హతకు తగ్గ వేతనం (స్టైపెండ్) పెంచాలని వాట్సాప్‌లో మెసేజ్ పంపినందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌ను తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో నా ఇంటర్న్‌షిప్‌ను రద్దు చేశారు.. అంటూ సదరు టెక్కీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కంపెనీ భారాన్ని మోసి.. చివరకు..

బాధిత టెక్కీ కథనం ప్రకారం.. ఆమె ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో ఏఐ ఇంజినీర్ ఇంటర్న్‌గా చేరారు. ఆరు నెలల కాలపరిమితి గల ఈ ఇంటర్న్‌షిప్‌లో ఆమెకు అత్యంత స్వల్ప మొత్తాన్ని స్టైపెండ్‌గా నిర్ణయించారు. ఆ స్టార్టప్‌ సాంకేతిక విభాగంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆమే కావడం గమనార్హం. ఒక ఇంటర్న్ అయినప్పటికీ, సంస్థ కోసం ఆమె నిత్యం శ్రమిస్తున్నారు.

కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి స్మాల్ లాంగ్వేజ్ మోడల్ (ఎస్‌ఎల్‌ఎం)ను ఆమే స్వయంగా అభివృద్ధి చేశారు. సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి జాప్యం (Latency) తగ్గించేలా కోడింగ్‌ను ఆప్టిమైజ్ చేశారు. ఆమె ప్రతిభ కారణంగా సదరు స్టార్టప్‌కు ఏకంగా ఏడుగురు కొత్త క్లయింట్లు వచ్చారు. మూడు నెలల విజయవంతమైన పనితీరు తర్వాత ఆన్‌బోర్డింగ్ సమయంలో యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం స్టైపెండ్‌ రివిజన్ కోసం ఆమె మేనేజర్‌కు వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపారు.

వాట్సాప్ సందేశంలో ఏముందంటే..

‘హలో మేడమ్, నేను ఇక్కడ మూడు నెలలు పూర్తి చేసుకున్నాను. ఆన్‌బోర్డింగ్ సమయంలో మాట్లాడినట్లుగా నా స్టైపెండ్‌ రివిజన్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. గత 3 నెలల్లో నేను ఎస్‌ఎల్‌ఎం ఏజెంట్లను నిర్మించాను. వాటిని పరీక్షించాను. డెప్లాయ్‌ చేశాను. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా స్టైపెండ్‌ను కొంత మేర(XXXX) పెంచుతారని ఆశిస్తున్నాను. దీనిపై మరింత చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని రాశారు.

కానీ, ఈ సాధారణ మెసేజ్‌ను మేనేజర్ జీర్ణించుకోలేకపోయారు. ‘ఒక విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో పెంపు ఇవ్వడం అసాధ్యం’ అని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చేసిన పనిని కేవలం ‘టెస్టింగ్ క్యాంపెయిన్లు, టెస్ట్ క్లయింట్లు’ అంటూ తక్కువ చేసి మాట్లాడారు. స్వతంత్రంగా పనిచేయడాన్ని కూడా ఒక తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు.

తర్వాత కొన్ని రోజులకు..

ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే సదరు ఇంటర్న్‌కు కంపెనీ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. అంచనాలకు తగిన పని లేదనే (Mismatch in expectations) నెపంతో ఆమె ఇంటర్న్‌షిప్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కంపెనీ సీఈఓ ఆమెకు దాదాపు 30 నిమిషాల పాటు స్టార్టప్ సంస్కృతిపై ఉచిత ఉపన్యాసం ఇచ్చి ఆమెను ‘మనీ-మైండెడ్’ అని సంబోధించారు.

‘‘నాలుగు నెలల పాటు కష్టపడి రాసిన కోడ్‌ను పూర్తిగా విస్మరించారు. ‘మేము ఇంత మొత్తమే ఇవ్వగలం’ అని వారు నేరుగా చెప్పి ఉంటే నేను సంతోషంగా అంగీకరించేదాన్ని. కానీ కేవలం చర్చలు జరిపినందుకు నన్ను తీసేశారు’ అని టెక్కీ వాపోయారు. ‘ప్రామాణిక వ్యాపార చర్చలను వ్యక్తిగత ద్రోహంగా భావించే నిర్వాహకుల కింద వేతనం కోసం నేను భిక్షం ఎత్తాలనుకోవడం లేదు. అందుకే నా ఎ‍క్స్‌పీరియన్స్‌ లెటర్‌ కోసం డిమాండ్ చేస్తూ మెయిల్ పెడుతున్నాను’ అని ఆమె చెప్పారు.

నెటిజన్ల స్పందన

ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో ఐటీ నిపుణులు, నెటిజన్లు సదరు టెక్కీకి మద్దతుగా నిలుస్తున్నారు. కంపెనీల దోపిడీని ఎండగడుతూ పలువురు వ్యాఖ్యానించారు. ‘కూల్‌గా ఉండండి.. మీ ప్రమాణాలను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మిమ్మల్ని కోల్పోవడం ఆ కంపెనీకే నష్టం’ అని ఒకరన్నారు. ‘నాకు కూడా ఇలాగే జరిగింది. కంపెనీ అవసరాలకు మించి ఎక్కువ పనులు చేయకూడదని దీని ద్వారా నేర్చుకున్నాను’ అని మరొకరు చెప్పారు.

ఇదీ చదవండి: బంగారు పంట పండింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement