మీ వాట్సాప్ పని చేస్తోందా?. మెసేజ్‌లు వెళ్లకపోయినా.. అందుకోకపోయినా కంగారుపడకండి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో పలువురు యూజర్లు అనూహ్య సమస్యను ఎదుర్కొన్నారు. భారత్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వాట్సాప్ అకౌంట్లు సోమవారం రాత్రి ఒక్కసారిగా ‘అకౌంట్ ఇన్ రివ్యూ’ అంటూ కనిపించడంతో యూజర్లు ఆందోళనకు గురయ్యారు.
రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైనట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తమ అకౌంట్లు నిలిచిపోయాయని, మెసేజ్‌లు పంపడం, ఇతర ఫీచర్లు ఉపయోగించడం సాధ్యం కావడం లేదని తెలిపారు. అయితే.. రివ్యూ పూర్తయ్యే వరకు వాట్సాప్‌లోని ఫీచర్లు అందుబాటులో లేకుండా పోయాయి.
వాట్సాప్ స్క్రీన్‌పై “Account in review” అనే సందేశం కనిపించింది. యూజర్ల అకౌంట్ యాక్టివిటీ, డివైస్ వివరాలను తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, సాధారణంగా 24 గంటల్లో ఫలితం తెలియజేస్తామని అందులో పేర్కొంది.
ఈ పరిణామంపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ.. సేవలను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని అకౌంట్లను నిషేధిస్తామని తెలిపారు. అయితే కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉందని, అలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి యూజర్లను తిరిగి చాటింగ్‌కు అనుమతిస్తామని చెప్పారు.
కొంతమంది యూజర్లు తమ అకౌంట్లు ఎలాంటి కారణం లేకుండా డిసేబుల్ అయ్యాయని, అప్పీల్ చేసినా సాధారణ మెసేజ్ మాత్రమే వస్తోందని సోషల్ మీడియాలో వాపోయారు. అధికారిక వాట్సాప్ యాప్ మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ తమ అకౌంట్ నిలిపివేయడం అన్యాయమని కొందరు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభావితమైన అకౌంట్లను వాట్సాప్ పరిశీలిస్తోంది. 24 గంటల్లో సమీక్ష పూర్తయిన తర్వాత అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ఈ సమస్య మీ వాట్సాప్‌కూ ఎదురైందా? లేదా సాధారణంగా పనిచేస్తోందా అనే విషయాన్ని యూజర్లు చెక్ చేసుకోవచ్చు.
అయితే ఈ పరిణామంపై కొంతమంది యూజర్లు తమ వ్యక్తిగత సమాచారం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇది ప్రైవసీ ఉల్లంఘనకు సంబంధించిన సమస్యగా ఎలాంటి ఆధారాలు లేవు. వాట్సాప్ నిబంధనల ఉల్లంఘన, అనుమానాస్పద యాక్టివిటీ వంటి అంశాల ఆధారంగా అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్ల వ్యక్తిగత చాట్లు లేదా మెసేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ఎలాంటి సమాచారం లేదు.


